Sr NTR : స్వర్గీయ ఎన్టీఆర్ యుగ పురుషుడా.? అసమర్థుడా.?
Sr NTR : కొత్త చర్చ తెరపైకి వచ్చింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి. యుగ పురుషుడిగా స్వర్గీయ ఎన్టీయార్‌ని పొగుడుతుంటారు కొందరు. అందులో నిజం లేకపోలేదు. విశ్వ విఖ్యాత నట సార్వ భౌముడు.. మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఆయన పోషించినన్ని విభిన్నమైన పాత్రలు తెలుగు సినీ రంగంలో ఇంకెవరూ పోషించి వుండరేమో. రాజకీయాల్లో కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు రికార్డుని ఇంతవరకూ ఎవరూ బ్రేక్ చేయలేదు. స్వర్గీయ ఎన్టీయార్ అంటే ఆయన చుట్టూ వున్న ఘనతలే కాదు, ఫెయిల్యూర్స్ కూడా కనిపిస్తాయి.
పులిలా బతికాడాయన. కానీ, ‘కుక్క చావు’ అనడం సరికాదుగానీ, ఆ స్థాయిలో ఆయన చివరి రోజుల్లో తీవ్ర మనోవేదన అనుభవించారు. కూతుళ్ళు, కొడుకులు.. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆస్తులకు వారసులయ్యారు.. రాజకీయాలకు వారసులయ్యారు.. కొందరు నట వారసులయ్యారు.. కానీ, ఆయన్ని చివరి రోజుల్లో వీళ్ళెవరూ పట్టించుకోలేదు. రాజకీయాల్లో ఒకసారి మోసపోతే అది పొరపాటు. రెండోసారి మోసపోతే, దాన్ని అసమర్థత అంటారు. నాదెండ్ల భాస్కర్ రావు ద్వారా ఓ సారి ఎన్టీయార్ వెన్నుపోటుకు గురయ్యారు. ఆ తర్వాత సొంత అల్లుడు చంద్రబాబు చేతిలో రాజకీయంగా వెన్నుపోటుకు గురయ్యారు.
అలాంటప్పుడు, ఎన్టీయార్‌ని ‘నాయకుడు’ అని ఎలా అనగలం.? అందుకే అనేది, పులిలా బతికాడు.. చావు మాత్రం దారుణమైనది.. అని. తాత గొప్పల గురించి మనవళ్ళు చెబుతారు.. కానీ, ఆ తాత చివరి రోజుల్లో గడిపిన దయనీయ స్థితి గురించి ఏ మనవడూ ఆవేదన చెందడు, ఎవరికీ పౌరుషం కూడా రాలేదు. కొడుకుల పరిస్థితీ అంతే. హరికృష్ణ ఏం చేశాడు.? బాలకృష్ణ ఏం చేస్తున్నాడు.? మరి, వీళ్ళు తెలుగు నేల ఆత్మగౌరవం గురించి మాట్లాడటం శోచనీయమే కదా.!