KCR : ముచ్చటగా మూడోస్సారి.! తెలంగాణలో కేసీయార్‌కి అంత తేలిక కాదా.? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

KCR : ముచ్చటగా మూడోస్సారి.! తెలంగాణలో కేసీయార్‌కి అంత తేలిక కాదా.?

 Authored By prabhas | The Telugu News | Updated on :3 June 2022,1:30 pm

KCR : రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ముందే ఊహించడం కష్టం. తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఇప్పుడున్న ఈక్వేషన్స్ ప్రకారం చూస్తే, వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి కాంగ్రెస్ అలాగే బీజేపీ నుంచి పోటీ వుండొచ్చుగానీ, గులాబీ పార్టీ గెలుపుకు వచ్చిన డోకా ఏమీ వుండదనిపించడం సహజమే. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్నీ, గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల పలితాల్నీ, 2019 లోక్ సభ ఎన్నికల ఫలితాల్నీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో ముడిపెట్టి చూడటం ఎంతవరకు సబబు.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి 8 ఏళ్ళు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు జరిగాయి. ముఖ్యమంత్రి కేసీయార్ కూడా ఆ సంబరాల్లో పాల్గొన్నారు.

ఈ క్రమంలో కేంద్రంపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆసక్తికరమైన రీతిలో విమర్శలు చేశారు. నిజానికి, ఇలాంటి వేదికలపై కేసీయార్, రాజకీయ విమర్శలు చేస్తారని ఎవరూ ఊహించి వుండరు. అయితే, కేసీయార్ రాజకీయ వ్యూహాలు ఎవరికీ అంతుపట్టవు. అంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారాయన. తెలంగాణ అవతరణ దినోత్సవం నేపథ్యంలో, రాష్ట్ర ప్రజలందరిలోనూ సెంటిమెంట్ బలంగా వుంటుంది. ఈ సమయంలోనే, రాష్ట్ర సమస్యల్ని కేంద్రం నిర్లక్ష్యం చేస్తున్న వైనాన్ని కేసీయార్ ప్రస్తావిస్తే, ఆ ఇంపాక్ట్ తెలంగాణ ప్రజల మీద ఎక్కువగా, ఎక్కువకాలం వుండి తీరుతుంది.
పోలవరం ప్రాజెక్టు కోసమంటూ ఖమ్మం జిల్లాలోని కొంత భూభాగాన్ని, ఆంధ్రప్రదేశ్‌కి అప్పగించడం సహా అనేక అంశాల్ని కేసీయార్ ప్రస్తావించారు.

Isn't so easy for KCR in Telangana

Isn’t so easy for KCR in Telangana

కేంద్రం, తెలంగాణపై సవతి ప్రేమ చూపిస్తోందనీ అన్నారు. దేశానికి తెలంగాణ దిశా నిర్దేశం చేస్తుందనీ, అది ఓర్వలేక తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందని విమర్శించారు. దేశం పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదని కూడా కేసీయార్ ఆరోపించారు. కేసీయార్ నుంచి వచ్చిన ఒక్కో మాటా నిజంగానే తూటాలా పేలింది. ఇదంతా వచ్చే ఎన్నికల్ని లక్ష్యంగా పెట్టుకుని కేసీయార్ అమలు చేసిన వ్యూహమే. అయితే, వరుసగా రెండు దఫాలు అధికారంలోకి వచ్చిన గులాబీ పార్టీ, ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలంటే ముమ్మాటికీ ఏదైనా మ్యాజిక్ జరిగి తీరాల్సిందే. అది చేయగల సత్తా కేసీయార్‌కి వుందిగానీ.. టైమ్ ఎప్పుడూ ఒకే వైపు వుంటుందని అనుకోవడం కూడా పొరపాటే.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది