JanaSena : జనసేనాని గెటప్ మార్చేశారా.? కొత్త గెటప్ కొనసాగిస్తారా.?
JanaSena : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త గెటప్‌లో కనిపిస్తున్నారు. అచ్చం రాజకీయ నాయకుడిలా, సంప్రదాయ బద్ధమైన పంచె కట్టులో గతంలో ఎక్కువగా కనిపించేవారు పవన్ కళ్యాణ్. దానికి తోడు గుబురు గడ్డం.. చాలా చాలా ఇబ్బందిగా అనిపించేది పవన్ కళ్యాణ్ అభిమానులకి. కానీ, ఇప్పుడు నీట్ షేవింగ్‌తో కనిపిస్తున్నారు, క్యాజువల్ లుక్‌లో షర్ట్ టక్ ఇన్ చేసి కనిపించడం పట్ల జనసైనికులు పండగ చేసుకుంటున్నారనడం అతిశయోక్తి కాదు. ఇదే గెటప్, 2024 ఎన్నికల వరకూ తమ అధినేత పవన్ కళ్యాణ్ కొనసాగించాలన్నది పవన్ అభిమానులు, జనసైనికుల కోరిక.
ఏ గెటప్ అయితేనేం.? మాట్లాడే మాటల్లో స్పష్టత వుండాలి. చేసే రాజకీయాల్లోనూ స్పష్టత వుండాలి. పవన్ కళ్యాణ్ ఈ విషయంల తడబడుతుంటారు. కొన్ని డైలాగులు ఆయన అనుకోకుండా విసిరేస్తారో, ఆలోచించే విసురుతారోగానీ.. అవి జనసేన పార్టీ ‘పుట్టి’ ముంచేస్తున్నాయనడం నిస్సందేహం. ఉదాహరణకు వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకుని చీల్చను.. అనే మాటనే తీసుకుంటే.. అది అసందర్భ ప్రస్తావన. ఆ వ్యాఖ్యల నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ మీద ‘దత్త పుత్రుడు’ అనే ముద్ర పడింది. ఈ విషయంలో అధికార వైసీపీకి పవన్ కళ్యాణ్ చాలా మేలు చేశారు. పవన్ కళ్యాణ్‌ని విమర్శిచడానికి వైసీపీకి ఓ అస్త్రం దొరికినట్లయ్యింది. ఇక, మళ్ళీ గెటప్ విషయానికొస్తే..
రాజకీయాల్లో సింపుల్ అండ్ కాజువల్ లుక్ విషయానికొస్తే, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అదే ఆయన్ని జనం మనిషిగా మార్చేసిందని చెప్పక తప్పదు. పవన్ కళ్యాణ్ ఎటూ సినీ నటుడు గనుక, గెటప్ విషయంలో జాగ్రత్తలు తీసుకునే అవకాశం వుంది. కానీ, జాగ్రత్త పడలేకపోతున్నారు. అటు మాట జాగ్రత్త లేదు, ఇటు అప్పీయరెన్స్ విషయంలోనూ స్పష్టత లేకుండా పోతోంది. అభిమానులు ఆశించేలా పవన్ వుండగలిగినా.. అది జనసేన పార్టీకి ఎంతో కొంత ప్లస్ అవుతుంది.