Pawan Kalyan : సొంత పార్టీలో పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకత, పొత్తుల విషయంలో సీనియర్స్ అసంతృప్తి
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఒక వైపు పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటే.. ఆయన సొంత పార్టీ నాయకులే మనకు అంత సీను లేదు.. మనం ఈసారి కూడా ఎవరినో ఒకరిని సీఎం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాం అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. అంటే తెలుగు దేశం మరియు బీజేపీ లతో పవన్ పొత్తులకు ప్రాకులాడుతూ ఉన్నాడు కనుక జనసైనికులు అసంతృప్తితో ఉన్నారు. పొత్తులు పెట్టుకోవడం వల్ల మెజార్టీ స్థానాలు సీట్లు వదులుకోవాల్సి వస్తుంది. అలా అయితే పార్టీ నాయకులు చాలా మంది నష్టపోవాల్సి వస్తుంది. చాలా సంవత్సరాలు గా పార్టీ కోసం పని చేసి..
గత ఎన్నికల సమయంలో ఓడిపోయినా కూడా నిలిచి మళ్లీ సీటు వస్తే నిలిచి గెలవాలని భావిస్తున్న వారికి ఇది మింగుడు పడటం లేదు. చాలా కాలం పాటు పార్టీ కోసం పని చేసిన వారు ఇప్పుడు పొత్తుల్లో భాగంగా పోటీ చేయకుండా ఉండటం అంటే అది ఖచ్చితంగా తమను తాము నష్టపర్చుకోవడమే. అందుకే పవన్ పొత్తుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అధికారంలోకి వచ్చే మాట దేవుడు ఎరుగు.. కనీసం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి ఒకింత రాజకీయ లబ్ది పొందాలని భావిస్తున్న జనసైనికులు ఇప్పుడు పవన్ పై ఆగ్రహంతో ఉన్నారు. తెలుగు దేశం పార్టీ మరియు బీజేపీ తో పవన్ పొత్తు కోరుకుంటున్నాడు.
ఆ పొత్తు కనుక వర్కౌట్ అయితే దాదాపుగా 60 నుండి 70 శాతం సీట్లను వదిలేయాలి. ఆ సీట్లు ఏంటీ.. అలా వదిలి వేయడం ద్వారా ఎంత మంది సీనియర్ లకు అవకాశం లేకుండా పోతుంది అనే చర్చ ఇప్పుడు మొదలు అయ్యింది. ఎప్పటి వరకు సొంత పార్టీ అధినేత పొత్తుల విషయమై క్లారిటీ ఇస్తాడో అని చూస్తున్నారు. ఒక వేళ పొత్తుల సమయంలో తమకు సీటు రాకుంటే పది పన్నెండు మంది జనసేన సీనియర్ లు పార్టీ మారే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సొంతంగా పోటీ చేస్తే మళ్లీ గల్లంతు తప్పదు.. పొత్తులు పెట్టుకుంటే ఇబ్బందులు తప్పవు అన్నట్లుగా జనసేన పరిస్థితి ఉంది.