JanaSena : జనసేన ఓటు బ్యాంకు పెరిగింది.! కండిషన్స్ అప్లయ్.!
JanaSena : జనసేన పార్టీకి ఇది నిజంగానే గుడ్ న్యూస్.! జనసేన పార్టీ ఓటు బ్యాంకు పెరిగింది. అది కూడా రెండింతలు పెరిగిందనేది తాజా సర్వేల సారాంశం. ఇటీవలి కాలంలో ఏ సర్వే బయటకు వచ్చినా, అందులో జనసేన పార్టీ ప్రస్తావన కనిపించడంలేదు. ఎందుకంటే, దాదాపు అన్ని సర్వేలూ, లోక్ సభ నియోజకవర్గాల చుట్టూనే జరుగుతున్నాయి గనుక. ప్రధాన రాజకీయ పార్టీలు.. అంటే, టీడీపీ అలాగే వైసీపీ చుట్టూ మాత్రమే ఈ సర్వేలు జరుగుతున్నందున, జనసేన గురించిన ప్రశ్నలూ ఆ సర్వేల్లో కనిపించడంలేదు. అలా జనసేన పార్టీకి సంబంధించిన ఓటు బ్యాంకుపై స్పష్టత రావడంలేదు. అయితే, తాజాగా వెలుగు చూస్తున్న సర్వేల్లో జనసేన పార్టీకి ఓటు బ్యాంకు 2019 ఎన్నికలతో పోల్చితే డబుల్ అయ్యిందని తెలుస్తోంది.
గతంలో కేవలం ఆరు శాతం మాత్రమే జనసేనకు ఓటు బ్యాంకు లభించగా, అదిప్పుడు రెండింతలు అయ్యిందట. అంటే, 12 శాతం వరకు జనసేన ఓటు బ్యాంకు చేరుకుందని అనుకోవచ్చు. 2024 ఎన్నికల నాటికి ఈ ఓటు బ్యాంకు 15 శాతం దాటవచ్చునన్నది ఓ అంచనా. అయితే, జనసేన కొల్లగొట్టబోయేది ఓ పార్టీ తాలూకు ఓటు బ్యాంకు.? అన్నదానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. టీడీపీ ప్రధానంగా జనసేన వల్ల దెబ్బ తింటుందనీ, కొంత మేర వైసీపీకి కూడా ఎఫెక్ట్ వుండొచ్చనీ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా మారేందుకు ఇంకాస్త సమయం పడుతుందన్నది వారి వాదన. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వైసీపీనే అధికారంలోకి వస్తుందనీ, అయితే అప్పుడు బలమైన ప్రతిపక్షంగా టీడీపీ కంటే జనసేన తన ఉనికిని చాటుకోవచ్చని అంటున్నారు. కానీ, జనసేన పార్టీకి పెరుగుుతున్న జనార్ధనను జనసేనాని ఎలా ఉపయోగించుకోగలుగుతారు.? అన్నదానిపై మళ్ళీ భిన్నవాదనలున్నాయి.