Coconut | పూజలో కలశంపై పెట్టిన కొబ్బరి కాయ తినొచ్చా.. పండితులు ఏం చెబుతున్నారంటే.!
Coconut | హిందూ సంప్రదాయాల్లో నోములు, వ్రతాలు, ప్రత్యేక పూజల సందర్భంగా కలశ స్థాపనకు ఎంతో ప్రాధాన్యం ఉంది. సంక్రాంతి, దసరా, దీపావళి వంటి పండుగల సమయంలో కూడా భక్తులు కలశాన్ని పెట్టి గణపతి, లక్ష్మీదేవిని పూజిస్తారు. కలశాన్ని అమ్మవారిగా భావించి షోడశోపచార పూజలు చేసి, నైవేద్యాలు సమర్పిస్తారు. అయితే పూజ పూర్తయ్యాక కలశంపై ఉంచిన కొబ్బరికాయ ఏం చేయాలి అనే ప్రశ్న చాలామందిలో ఉత్పన్నమవుతుంది.
#image_title
చాలా మంచిది..
ఈ విషయంపై పండితులు చెబుతున్నదేమంటే..పూజలో సమర్పించిన కొబ్బరికాయ చాలా పవిత్రమైనదిగా పరిగణించాలి. శాస్త్రాల ప్రకారం అది దేవతల ప్రసాదం, దాన్ని తినడం వల్ల శుభఫలితాలు, సానుకూల శక్తి లభిస్తాయి. కొబ్బరి స్వచ్ఛత, అంకితభావానికి ప్రతీకగా భావించబడుతుంది. కాబట్టి ఈ కొబ్బరికాయను ఎప్పుడూ పారవేయకూడదు లేదా వృథా చేయకూడదు.
ప్రత్యేక పూజల్లో సమర్పించిన కొబ్బరికాయను ఆలయానికి తీసుకెళ్లి భక్తులతో పంచుకోవడం శ్రేయస్కరం. కొబ్బరి ప్రసాదం పంచితే కుటుంబంలో ప్రేమ, ఐక్యత పెరుగుతుందని నమ్మకం ఉంది. కలశంపై ఉంచిన కొబ్బరికాయను భగవంతుని స్వరూపానికి ప్రతీకగా పూజించే కారణంగా, అది కూడా అత్యంత పవిత్రమైనదే అని పండితులు స్పష్టం చేస్తున్నారు.