KCR : క్లౌడ్ బరస్ట్ ఇది విదేశాల కుట్ర.! కేసీయార్ సారూ.. నిజమేనా.?
KCR : క్లౌడ్ బరస్ట్.. దీన్నే కుండపోత.. అని కూడా అంటాం. అయితే, ఈ కుండపోత మామూలుగా వుండదు.. మేఘానికి చిల్లు పడినట్లే వుంటుంది పరిస్థితి. ఒక్కసారిగా రికార్డు స్థాయిలో వర్షం కురుస్తుంది.. వాగులు, వంకలు, నదులు ఉప్పొంగుతాయ్. నగరాలు సైతం గంటల వ్యవధిలో మునిగిపోతాయ్.!
అసలు ఇప్పుడీ క్లౌడ్ బరస్ట్ గురించిన చర్చ ఎందుకు జరుగుతోందంటే, ఇటీవలి కాలంలో తరచూ ఈ క్లౌడ్ బరస్ట్ కారణంగా నగరాలు, పట్టణాలు, పర్యాటక ప్రాంతాలూ ఆకస్మిక వరదలతో విలవిల్లాడుతున్నాయి. ఉత్తరాఖండ్ వరదలు కావొచ్చు, కాశ్మీర్‌లో అమర్‌నాథ్ యాత్ర సందర్భంగా తలెత్తిన ప్రమాదకర పరిస్థితులు కావొచ్చు,
చెన్నయ్, ముంబై, హైద్రాబాద్ వంటి నగరాలు మునిగిపోవడం కావచ్చు.. ఇదంతా క్లౌడ్ బరస్ట్ వల్లనే. దీని వెనుక విదేశాల కుట్ర వుంటుందా.? వుంటుందనే అనుమానం వ్యక్తం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. వరుసగా వరదలు వస్తుండడంతో అనుమానాలకు ఆస్కారం వుందన్నది కేసీయార్ ఉవాచ. తెలంగాణలో అనూహ్యమైన రీతిలో వచ్చిన వరదల నేపథ్యంలో, బాధితుల్ని పరామర్శించడంతోపాటుగా, సహాయక చర్యలెలా జరుగుతున్నాయో స్వయంగా పరిశీలించారు కేసీయార్. ఈ సందర్భంగానే క్లౌడ్ బరస్ట్..
విదేశీ కుట్ర అంశాన్ని తెరపైకి తెచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి. కేసీయార్ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ‘కేసీయార్ వ్యాఖ్యలు ఈ శతాబ్దానికే పెద్ద జోక్..’ అన్నారు కమలం నేత బండి సంజయ్. కానీ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధించిన ప్రగతి కాస్తా మానవ వినాశనానికీ ఉపయోగిస్తున్నాయి కొన్ని శక్తులు. ఆ లెక్కన క్లౌడ్ బరస్ట్ వెనుక కుట్ర లేదని ఎలా అనగలం.? అయినాగానీ, ఓ ముఖ్యమంత్రి ఇలాంటి ఆరోపణలు చేయడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఈ విషయమై లోతైన చర్చ జరగాల్సి వుంది.