KCR : కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పాయె.. మెయిన్ ఫ్రంట్ వస్తోందాయె.!
KCR : దేశంలో ఫెడరల్ ఫ్రంట్ అవసరం వుందంటూ కొన్నాళ్ళ క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దేశంలో బీజేపీకి వ్యతిరేక గాలి ఏమీ అంత బలంగా వీయడంలేదు. అలాగని, బీజేపీ పాలన పట్ల వ్యతిరేకత లేదా.? అంటే, వుందిగానీ.. అది పైకి కనిపించే స్థాయిలో లేదు. దాంతో, కొత్త కూటమి ఏదీ నిలదొక్కుకునే పరిస్థితి కనిపించడంలేదు.
మరెలా కేసీఆర్, ఫెడరల్ ఫ్రంట్ అన్నారు.? అంటే, అదంతే.. తెలంగాణలో రాజకీయ ప్రయోజనాల కోసం కేసీయార్, ‘ఫెడరల్ ఫ్రంట్’ అంటుంటారు. ఆ ఫ్రంట్‌లోకి వెళ్ళేందుకు ఎవరూ అంత సుముఖత వ్యక్తం చేయరు. దానిక్కారణం, ఫెడరల్ ఫ్రంట్‌లోకి ఎవరైతే రావాలని కేసీయార్ కోరుకుంటున్నారో, వారందరికీ వేర్వేరు రాజకీయ ప్రయోజనాలున్నాయి. ఫెడరల్ ఫ్రంట్ ద్వారా అధికారం దక్కే అవకాశం వుంటే అది తమకే దక్కాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తదితరులు అనుకోకుండా వుంటారా.? అందుకే, కేసీయార్ ఆలోచనలు ముందుకు సాగడంలేదు. ఆయనకీ ఫెడరల్ ఫ్రంట్ విషయమై ఎప్పుడో నీరసం వచ్చేసింది.
ఇప్పుడేమో కొత్తగా బీహార్ సీఎం నితీష్ కుమార్.. మెయిన్ ఫ్రంట్ అంటున్నారు. ఈయన్నే మొన్నీమధ్య తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ కలిశారు.. ఫెడరల్ ఫ్రంట్ కోసం. ‘మాది మూడో ఫ్రంట్ కాదు, మెయిన్ ఫ్రంట్..’ అని నితీష్ కుమార్ తాజాగా చెప్పారు. నిన్న మొన్నటిదాకా ఈయనా బీజేపీ పంచన సేద తీరిన విషయం అందరికీ గుర్తుండే వుంటుంది.
దేశంలో రాజకీయం అంటే ఓ ఆటలా మారిపోయింది. ఎవరికి తోచినట్టు వాళ్ళు ఆడేస్తున్నారు. అంతే తప్ప, ప్రజల్లోకి వెళ్ళి.. ఆ ప్రజల ద్వారా రాజకీయం చేయాలని ఏ రాజకీయ పార్టీ కూడా అనుకోవడంలేదు. బీజేపీని గద్దె దించాలంటే, బలమైన సంకల్పం అవసరం. అది ఏ రాజకీయ పార్టీలోనూ వున్నట్లు కనిపించడంలేదు.