లాక్ డౌన్ పై KCR వ్యూహాత్మక నిర్ణయం!
KCR : దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రతి రోజు కూడా మూడున్నర లక్షలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. మూడు నాలుగు రోజుల్లో రోజు వారి కేసుల సంఖ్య అయిదు లక్షల వరకు చేరే అవకాశం ఉందంటున్నారు. ఇలాంటి సమయంలో కరోనా ను అదుపులోకి తీసుకు వచ్చేందుకు కేంద్రం లాక్ డౌన్ ను విధించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మే 3న లేదా మే మొదటి వారంలో ఏ రోజు నుండైనా లాక్ డౌన్ ను అమలు చేయాలని కేంద్రం నిర్ణయానికి వచ్చింది. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయకుండా కొన్నింటికి మినహాయింపు ఇచ్చి లాక్ డౌన్ ను కొనసాగించాలని కేంద్రం భావిస్తున్న సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు కీలక నిర్ణయం తీసుకోబోతుంది.
నేటితో నైట్ కర్ఫ్యూ గడువు పూర్తి..
తెలంగాణలో ఏప్రిల్ 30 వరకు నైట్ కర్ఫ్యూ అంటూ కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేటితో నైట్ కర్ఫ్యూ గడువు ముగియబోతుంది. దాంతో రేపటి నుండి పరిస్థితి ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాక్షికంగా లాక్ డౌన్ ను ప్రకటించబోతున్నారా లేదంటే నైట కర్ఫ్యూను కంటిన్యూ చేస్తారా అనేది నేడు సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఆయన అధికారులు మరియు ఆరోగ్య శాఖ సిబ్బందితో చర్చలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. లాక్ డౌన్ విషయంలో కేసీఆర్ నిర్ణయం తీసుకోక పోవచ్చు అంటున్నారు.
కేంద్రంపైనే నింద..
లాక్ డౌన్ వల్ల ఒరిగేది ఏమీ లేదు అంటూ గత ఏడాది లాక్ డౌన్ వల్ల తెలిసి వచ్చింది. అందుకే లాక్ డౌన్ ను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించడం లేదు. ఒక వేళ లాక్ డౌన్ ను విధించినా కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎలాగూ దేశ వ్యాప్తంగా కేంద్రం లాక్ డౌన్ ను విధించాలని భావిస్తుంది. కనుక ఆ నింద ఏదో కేంద్ర ప్రభుత్వంకే పడనివ్వు అన్నట్లుగా కేసీఆర్ భావిస్తున్నారట. రేపటి నుండి ప్రత్యేకంగా మార్పు ఏమీ లేకుండా నైట్ కర్ఫ్యూను కంటిన్యూ చేస్తారని ప్రభుత్వ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. కేంద్రం లాక్ డౌన్ నిర్ణయం తీసుకుంటే కేసీఆర్ సమర్ధించే అవకాశం ఉందని అంటున్నారు. లాక్ డౌన్ నింద మోయకుండా కేసీఆర్ వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకుంటున్నారు.