KCR : కేసీఆర్ జాతీయ పార్టీ.! నిజమేనా.? నమ్మొచ్చంటారా.?
KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారట. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ఆయనకు ఓ రాజకీయ పార్టీ వుండగా, మళ్ళీ కొత్త రాజకీయ పార్టీ అవసరమేమొచ్చింది.? అంటే, తెలంగాణ రాష్ట్ర సమితి.. ఓ ప్రాంతీయ పార్టీ. కేసీయార్ ఆలోచనలేమో జాతీయ పార్టీ దిశగా సాగుతున్నాయి. దాంతో, జాతీయ పార్టీ అవసరమైందాయనకి. త్వరలో, అతి త్వరలో భారతీయ రాష్ట్ర సమితి పేరుతో ఓ పార్టీ ఆయన స్థాపించబోతున్నారంటూ ఊహాగానాలు షురూ అయ్యాయ్.
నిప్పు లేకుండా పొగ పుట్టదు.. అనేది సాధారణంగా మనం వినే మాట. కానీ, రాజకీయాల్లో పొగ రావడానికి నిప్పు అవసరం లేదు. పైగా, పొగ పుట్టించేసి, ఆ తర్వాత నిప్పు రాజేస్తారు రాజకీయ నాయకులు.
కేసీయార్ జాతీయ పార్టీ కూడా, ఆయన సన్నిహితుల నుంచి వస్తోన్న లీకుల సారాంశమే. ఇదిప్పటి కొత్త పంచాయితీ కాదు, ఎప్పటినుంచో నడుస్తున్నదే. కాకపోతే, కేసీయార్ ఆశించిన ‘సరైన సమయం’ రావడానికే చాలా సమయం పడుతోంది. అదీ అసలు సంగతి. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే జాతీయ స్థాయిలో కొత్త పార్టీ గురించి కేసీయార్ ఆలోచన చేశారు. కానీ, అప్పట్లో కుదరలేదు. అప్పటినుంచీ, ‘నేను ఢిల్లీ రాజకీయాల్లోకి వెళతా..’ అని కేసీయార్ చెప్పడం తప్ప, ఆయన ఆ దిశగా సాహసోపేతమైన నిర్ణయమైతే తీసుకోలేకపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బాద్యతల్ని కుమారుడు కేటీయార్‌కి కేసీయార్ అప్పగించేసి, జాతీయ రాజకీయాల్ని చూసుకోవచ్చు.కానీ, ఆయన ఎందుకో ఈ విషయమై వెనుకాడుతున్నారు.
దేశాన్ని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు నాశనం చేశాయన్న గట్టి నమ్మకంతో వున్నారు కేసీయార్. అదే మాట పదే పదే ఆయన చెబుతున్నారు కూడా. చిత్రమేంటంటే, యూపీఏ హయాంలో కేసీయార్ కేంద్ర మంత్రిగా కూడా పని చేశారండోయ్. అప్పటి కేంద్రంలో భాగమై కూడా, కేసీయార్ ఇలాంటి విమర్శలు చేయడంలో వింతేమీ లేదు. ఇది రాజకీయం, ఇక్కడ ఇలాగే వుంటుంది. కానీ, జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి కేసీయార్ ఏం చేయగలుగుతారు.? బీజేపీకి దేశంలో ఎదురే లేదు. అయినాగానీ, నరేంద్ర మోడీ ధైర్యంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. కేసీయార్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే, ఆయన్న కిందకి తోసెయ్యడానికి చాలామందే పైకొస్తారు. వారిని తట్టుకుని, కేసీయార్ కలలుగన్న సరికొత్త భారతావని ఆవిష్కరణ జరిగేనా.? అసలు కేసీయార్, అక్కడిదాకా వెళ్ళడం జరిగే పనేనా.?