Kodali Nani : పండుగ రోజు ముగ్గురు మహిళల ప్రాణాలని తీసేసిన చంద్రబాబు మీద చర్యలు తీసుకోవాలి.. కొడాలి నాని
Kodali Nani : గుంటూరు తొక్కిసలాట ఘటన చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి వల్లే జరిగిందని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. సభల కోసం చంద్రబాబు జనాన్ని తీసుకువచ్చి పిచ్చి పబ్లిసిటీ చేస్తున్నారని మండిపడ్డారు. ఇరుకు సందులు చూసుకుని డ్రోన్ కెమెరాలతో షూటింగ్ చేయడం వల్ల మొన్న కందుకూరులో ఎనిమిది మంది ప్రాణాలు పోగా, ఇప్పుడు గుంటూరులో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. బాబు అధికారంలోకి రావడం కోసం ఎంతమందినైనా పబ్లిసిటీ స్టంట్స్ కి బలి ఇస్తారని కొడాలి నాని విరుచుకు పడ్డారు. “సభల కోసం చంద్రబాబు జనాన్ని తీసుకువచ్చి పిచ్చి పబ్లిసిటీ చేస్తున్నారు. కానుకలిస్తామని పదిరోజుల నుంచి ప్రచారంతో ఊదరగొట్టారు. ఒక్కో మహిళకు మూడు చీరలిస్తామని చెప్పారు. 30 వేల టోకెన్లు పంచారు.
కనీసం పది మందికి కూడా పంచకుండానే ప్రాణాలు తీశార”ని నాని వ్యాఖ్యానించారు. “చంద్రబాబు స్పీచ్ కోసం దాదాపు రెండున్నర గంటల సేపు జనాన్ని క్యూలో నిలబెట్టారు. నలుగురికి చీరలు పంచి హడావుడి చేశారు. తొక్కిసలాట కారణంగా ముగ్గురు చనిపోయారు. ఈ మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? వీళ్ల ఉసురు చంద్రబాబుకి కచ్చితంగా తగులుతుంది. ముఖ్యమంత్రి అయ్యాకే శాసనసభకు వస్తానన్న 420 చంద్రబాబు చనిపోయిన మహిళలకు ఏం సమాధానం చెబుతారు? అధికారంలోకి రావడానికి ఎవరెలా పోయినా చంద్రబాబుకి అవసరం లేదు. చంద్రబాబు ఎక్కడ కాలు పెడితే అక్కడ నాశనమే. ఈ ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గుంటూరు ఘటనపై న్యాయ విచారణ చేపట్టాల”ని కొడాలి నాని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు బహిరంగ సభల అనుమతి ఇవ్వొద్దు యమ రథంతో చంద్రబాబు ప్రజలను చంపుతున్నాడని, ఏడాది చివర ఎనిమిది మందిని,Guntur issues
కొత్త ఏడాది ప్రారంభంలో ముగ్గురిని బలిగొన్న నరరూప రాక్షసుడు చంద్రబాబు అని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. శని గ్రహాన్ని మించిన జామాతా దశమగ్రహమంటూ మండిపడ్డారు. బాబు పబ్లిసిటీ పిచ్చితో అమాయకులు బలి అవుతున్నారని, కనుక చంద్రబాబుకు బహిరంగ సభలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. మొదలు, చివర తెలియని ఎన్నారైలు నిర్వహించిన ఇలాంటి కార్యక్రమానికి బుద్ధున్న వారెవరూ వెళ్లరని వ్యాఖ్యానించారు. బాబు చేసిన నేరాన్ని పోలీసులపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని, టీడీపీ సభలకు సూచనలు చేస్తే, పోలీసులు తమపై ఆంక్షలు విధిస్తున్నారని గగ్గోలు పెడతారని విమర్శించారు. నూటికి నూరు శాతం చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితోనే మరణాలు సంభవించాయన్నారు. ప్రతి ఎన్నికలో ఎవరో ఒకరి కాళ్లు పట్టుకొని గెలవడమే చంద్రబాబుకు తెలుసని, స్వయంగా ఆయన గెలవడం కల అని కొడాలి నాని దుయ్యబట్టారు.