Komatireddy RajGopal Reddy : కాంగ్రెస్ ఆరాటం వృధా.. బీజేపీలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.!
Komatireddy RajGopal Reddy : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి, భారతీయ జనతా పార్టీలో చేరేందుకు ఇప్పటికే నిర్ణయం తీసేసుకున్నారు. అయితే, భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన ఇంకేదో ఆశిస్తున్నారు. దానికి సంబంధించి అటువైపు నుంచి స్పష్టమైన హామీ వస్తే, ఏ క్షణాన అయినా ఆయన కమలం పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమే. కాంగ్రెస్ పార్టీ కూడా కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి విషయంలో ఆశలు వదిలేసుకుంది. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి. సోదరుడు కోమటిరెడ్డి వెంకట రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా వున్నారు. ఆయన పీసీసీ అధ్యక్ష పదవిని ఆశించి భంగపడడ్డారు కూడా.
కాంగ్రెస్ పార్టీలో స్టార్ క్యాంపెయినర్‌గా పనిచేస్తున్నారు కోమటిరెడ్డి వెంకట రెడ్డి ప్రస్తుతం. నిజానికి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడే. కానీ, తనంతట తానుగా ఆయన కాంగ్రెస్ పార్టీతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు కొన్నాళ్ళ నుంచి. సరిగ్గా ఈ సమయంలోనే భారతీయ జనతా పార్టీ తెలంగాణ నాయకత్వం, రాజగోపాల్ రెడ్డిని తమవైపుకు తిప్పుకుంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద ఇప్పటిదాకా తనకున్న అభిమానాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మీదకు మళ్ళించినట్లు కనిపిస్తోంది.
తెలంగాణ బీజేపీలో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం ఖాళీగా వుండటంతో, ఆ దిశగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఆలోచిస్తున్నారనీ, ముందుగా రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళుతున్నారనే ప్రచారం ఉంది. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే మరి. కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీతో విసిగిపోయారనీ, బీజేపీలోకి ఆయన రావడం ఖాయమని తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ చెప్పడం గమనార్హం. అయితే, పార్టీ మారే విషయమై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంకా నిర్ణయం తీకోలేదట. కేసీయార్‌ని ఓడించడమే కోమటిరెడ్డి బ్రదర్స్ ముందున్న లక్ష్యమని కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి చెబుతుండడం ఈ మొత్తం వివాదానికే హైలైట్.