Konaseema District : కోనసీమ జిల్లాలో ‘చిచ్చ’ రేపిన అంబేద్కర్ పేరు వెనుక.!
Konaseema District : దేశంలో చాలా జిల్లాలున్నాయ్. మరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లాకే ఎందుకు రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలి.? అంటే, అక్కడ అంబేద్కర్‌ని అభిమానించేవారి సంఖ్య ఎక్కువగా వుంటుంది గనుక.. అని మాత్రమే చెబితే సబబుగా వుండదు. దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ అంబేద్కర్‌ని అభిమానించేవారున్నారు. కులమతాలకతీతంగా అంబేద్కర్ భావజాలాన్ని ఇష్టపడేవారు అన్ని చోట్లా వుంటారు. కానీ, ఎప్పటినుంచో కోనసీమ ప్రాంతంలో ‘బీఆర్ అంబేద్కర్ జిల్లా’ అనే డిమాండ్ వుంది. అది మరీ, కోనసీమ జిల్లా అనేంతటి స్థాయి డిమాండ్ అయితే కాదు. బాలయోగి జిల్లా, అంబేద్కర్ జిల్లా.. అలాగే కోనసీమ జిల్లా అనే పేర్లతో డిమాండ్లు చాలాకాలంగా వున్నాయి.
ఈ క్రమంలోనే వివాదాలకు తావు లేకుండా కోనసీమ జిల్లా అనే పేరు పెట్టింది వైఎస్ జగన్ సర్కారు. అయితే, కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో ఎన్టీయార్, సత్యసాయి, అన్నమయ్య, వైఎస్సార్, అల్లూరి పేర్లుపెట్టినప్పుడు, అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టరు.? అన్న ప్రశ్న దళిత సంఘాల నాయకుల నుంచీ, వివిధ రాజకీయ పార్టీల నుంచీ ప్రభుత్వంపైకి దూసుకొచ్చింది. దాంతో, ప్రభుత్వంలో సమాలోచనలు జరిగి, కోనసీమ ప్రాంతంలో ఎప్పటినుంచో అంబేద్కర్ జిల్లా అనే డిమాండ్ వుంది గనుక, ఆ జిల్లాకి అంబేద్కర్ పేరుని జోడించింది వైఎస్ జగన్ ప్రభుత్వం. ఇదీ అసలు నేపథ్యం. అయితే, ఇక్కడే రాజకీయం వికటాట్టహాసం చేసింది.
ఏ రాజకీయ శక్తి కోనసీమ మీద కుట్ర పన్నిందోగానీ, పచ్చని కోనసీమలో కాక రేగింది. అధికార పార్టీకి చెందిన మంత్రి ఇల్లు, అధికార పార్టీకే చెందిన ఓ ఎమ్మెల్యే ఇంటిని ఆందోళనకారులు తగలబెట్టారు. అచ్చం గతంలో తూర్పుగోదావరి జిల్లా తుని వద్ద రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ తగలబడినప్పుడు చోటు చేసుకున్న పరిణామాలే ఇక్కడా రిపీట్ అయ్యాయి. అధికార, విపక్షాల మధ్య ‘ఈ పాపం నీది.. అంటే కాదు, నీది..’ అనే రచ్చ మొదలైంది. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర విపక్షాలు చేస్తున్నాయనీ, అందులో భాగంగానే ఈ ఘటన జరిగిందన్నది ప్రధానమైన ఆరోపణ. దీన్ని విపక్షాలు ఖండిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు వ్యవస్థ ఈ ఘటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, కుట్రదారులకు తగిన శాస్తి చెయ్యాలి.