Konijeti Rosaiah : ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కె రోశయ్య కన్నుమూత.. ఆయన రాజకీయ ప్రస్థానమిదే..
Konijeti Rosaiah : నిఖార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పని చేసి ఆ పార్టీ నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు కొణిజేటి రోశయ్య. ఉమ్మడి ఏపీకి సీఎంగా పని చేసిన ఆయన ఆ తర్వాత కాలంలో గవర్నర్‌గా నియమితులయ్యారు. గవర్నర్ పదవీ కాలం పూర్తి అయిన తర్వాత రోశయ్య ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. శుక్రవారం హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌లోని ఆయన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే పరిస్థితి విషమించి కన్నుమూశారు.
బంజారాహిల్స్ స్టార్ ఆస్పత్రికి తీసుకొచ్చే సరికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లుగా డాక్టర్స్ నిర్ధారించినట్లు తెలుస్తోంది. ఇంటి నుంచి ఆస్పత్రికి తీసుకొస్తుండగా మార్గ మధ్యలోనే చనిపోయారని వైద్యులు తెలిపారు. ఇకపోతే కుటుంబసభ్యులు రోశయ్య పార్థివదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. రాజకీయాల్లో అజాతశత్రువుగా పేరుగాంచిన కొణిజేటి రోశయ్య 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు. గుంటూరు హిందూ కాలేజ్‌లో కామర్స్ చదివిన రోశయ్య.. విద్యార్థి రాజకీయాల్లో ఉన్నారు.
Konijeti Rosaiah : ఆర్థిక విషయాలపై పట్టున్న నేత..
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడైన రోశయ్య.. కాంగ్రెస్ పార్టీలో చేరి నిబద్ధతతో పార్టీకి సేవలందించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో రోడ్డు రహదార్లు శాఖ, రవాణ శాఖల మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా పని చేసిన రోశయ్య..అనంతరం.. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల గవర్నర్‌గా పనిచేశారు. మంచి వక్తగా పేరు తెచ్చుకున్న రోశయ్యకు ఆర్థిక విషయాలపైన మంచి పట్టుంది. తనదైన శైలిలో నిబద్ధతత, నిజాయతీతో కూడిన రాజకీయాలను రోశయ్య చేసేవారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల టీపీసీసీ చీఫ్‌గా నియమితులైన మల్కాజ్ గిరి ఎంపీ ఏ.రేవంత్ రెడ్డి రోశయ్య ఆశీర్వాదం తీసుకునేందుకుగాను ఆయన ఇంటికి వెళ్లారు. చాలా మంది కాంగ్రెస్ పార్టీ ఇక అధికారంలోకి రాదు అనుకునే సమయంలోనూ రోశయ్య గాంధీభవన్‌లో ఉండే వారని ఆ పార్టీ శ్రేణులు గుర్తు చేసుకుంటున్నాయి.