Revanth Reddy : రేవంత్ రెడ్డికి పీసీసీ పీఠం దక్కకుండా వెనక్కి లాగుతున్నది ఎవరు?
Revanth Reddy : చిన్నపిల్లలు నడిచే క్రమంలో టప్పటడుగులు వేస్తుంటారు. అప్పుడు చిన్నచిన్న దెబ్బలు తగలడం కూడా సహజమే. కానీ.. వాళ్ల లక్ష్యం ఏంటి.. సరిగ్గా నడవడం. పిల్లలకు నడవడం ఎవ్వరూ నేర్పించరు. వాళ్లంతట వాళ్లే నేర్చుకుంటారు. కాకపోతే మధ్యలో కొన్ని గాయాలు అవడం అనేది ఎంత మామూలో.. రాజకీయాల్లో రాణించాలన్నా కూడా మధ్య మధ్యలో అటువంటి గాయాలు సహజం. ఎదురుదెబ్బలు సహజం. అన్నింటికీ ఓర్చుకొని ముందుకు వెళ్తేనే రాజకీయాల్లో రాణిస్తారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ లో మంచి భవిష్యత్తు ఉంది. తెలంగాణలోనూ రేవంత్ రెడ్డికి ఉన్న ఫాలోయింగే వేరు. అందుకే.. రేవంత్ రెడ్డిని త్వరలోనే టీపీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తారంటూ వార్తలు వచ్చాయి. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా రేవంత్ వైపే మొగ్గు చూపారని.. త్వరలోనే ఆయనకు ఇక పట్టాభిషేకమే అన్నట్టుగా వార్తలు వచ్చాయి.

malkajgiri congress mp revanth reddy
అయితే.. అప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరు. ఇటీవల రేవంత్ రెడ్డిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చార్జిషీటు ఫైల్ చేసింది. అది కూడా ప్రధాన నిందితుడిగా. ఓటుకు నోటు కేసులో అప్పట్లోనే రేవంత్ రెడ్డి అడ్డంగా ఏసీబీ అధికారులకు దొరికిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆ కేసులు నత్తనడకన సాగుతూనే ఉంది. కానీ.. తాజాగా ఆ కేసులో ప్రధాన నిందితుడిగా రేవంత్ రెడ్డిని పేర్కొంటూ ఈడీ చార్జిషీటు దాఖలు చేయడంతో.. అసలు కథ మళ్లీ మొదటికొచ్చింది.
Revanth Reddy : ఆరేళ్ల తర్వాత మళ్లీ ఆ కేసు ఎందుకు రీఓపెన్ అయింది?
ఎప్పుడో ఆరేళ్ల కిందటి కేసు. ఇప్పుడు ఇంత సడెన్ గా ఎందుకు తెరమీదికి వచ్చింది. అదే ఇప్పుడు పెద్ద అనుమానం. నిజానికి.. రేవంత్ రెడ్డి అంటే పడని వాళ్లు.. తెలంగాణలోనే కాదు.. ఏపీలోనూ ఉన్నారు. తెలంగాణలో అయితే.. తన సొంత పార్టీ కాంగ్రెస్ లోనే తనకు శత్రువులు ఉన్నారు. చాలామంది సీనియర్ నేతలకు రేవంత్ రెడ్డి అంటే పడదు. అదే కొంప ముంచిందా? లేక టీఆర్ఎస్ పార్టీతో పెట్టుకున్న వైరం కారణంగా ఈ కేసును మళ్లీ తవ్వి తీశారా? అనేది తెలియనప్పటికీ.. రేవంత్ రెడ్డి రాజకీయ ఆశలపై మాత్రం ఈ చార్జిషీటు నీళ్లు చల్లినట్టే.

Revanth Reddy
ఈసమయంలో రేవంత్ రెడ్డికి.. పీసీసీ చీఫ్ పదవి అప్పగిస్తే.. ఒక కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తికి ఎలా పీసీసీ చీఫ్ పదవిని ఇస్తారు అని సొంత పార్టీ నేతల నుంచే కాంగ్రెస్ కు వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. అలాగే.. ఇతర పార్టీలు కూడా అదే విషయాన్ని లేవనెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఎటువంటి అడుగు వేస్తారు? అనేదే ప్రస్తుతం పెద్ద ప్రశ్న. కాంగ్రెస్ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుంది.. అనేది కూడా తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.