Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి.! ఆ గౌరవం ఇంకా అలాగే వుంది.!
Chiranjeevi : రాజకీయాలకు దూరమైనాగానీ, మెగాస్టార్ చిరంజీవికి రాజకీయాల్లో ఇంకా అదే గౌరవం అలా కొనసాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి సొంతూరు మొగల్తూరు.. ఇది ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వుంది. ఆ జిల్లాలోని భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ జరగబోతోంది. జులై 4న అల్లూరి జయంతి నేపథ్యంలో, ఆజాదీ కా అమృత మహోత్సవ్ కార్యక్రమాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ భీమవరం వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా భారీగానే సన్నద్ధమవుతోంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసం ఆహ్వానం పలికారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గతంలో చిరంజీవి కేంద్ర మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. చిరంజీవి కేంద్ర మంత్రి మాత్రమే కాదు, ఎమ్మెల్యేగానూ సేవలందించారు. రాజ్యసభ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా, కేంద్ర మంత్రిగా చిరంజీవి అందించిన సేవలు, ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. అయితే, ఇప్పుడున్న రాజకీయాల్లో ఇమడలేక, రాజకీయాల నుంచి చిరంజీవి తప్పుకున్నారు.

Megastar Chiranjeevi Still has the Political Charm
అయినాగానీ, చిరంజీవిని తిరిగి రాజకీయాల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలైతే సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీ కూడా చిరంజీవితో సన్నిహిత సంబంధాల్ని కోరుకుంటోంది. చిరంజీవి కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకుంటున్న కీలక నిర్ణయాల్లో కొన్నింటికి మద్దతు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలోనే, చిరంజీవికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అల్లూరి విగ్రహావిష్కరణ సందర్భంగా తగిన గౌరవం ఇచ్చే అవకాశం లేకపోలేదు. సినీ నటుడిగా, రాజకీయ ప్రముఖుడిగా చిరంజీవి సాధించిన పేరు ప్రఖ్యాతులు, ఆయన్ని ఓ విలక్షణమైన ప్రముఖుడిగా మార్చాయి.