Minister Ambati Rambabu : జనాన్ని చంపింది కాక జీవోపై రగడా.. మంత్రి అంబటి రాంబాబు..!!
Minister Ambati Rambabu ; పేద ప్రజలను చంపింది కాక జీవోపై రగడ చేస్తున్న చంద్రబాబు రంకెలకు బెదిరేది లేదని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. తాడేపల్లిలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి అంబటి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ప్రజల ప్రాణలతో చెలగాటం ఆడటం చంద్రబాబుకు అలవాటైపోయిందని మండిపడ్డారు. కందుకూరు, గుంటూరు ఘటనలను మరిపించేందుకే చంద్రబాబు జీవో పేరుతో కొత్త డ్రామాకు తెరలేపారని మంత్రి అంబటి మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో-1ని తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలు ర్యాలీలు పెట్టుకునేందుకు ప్రభుత్వం ఎక్కడా అడ్డు చెప్పడం లేదని.. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు మాత్రమే జీవోను తీసుకు వచ్చిందని స్పష్టం చేశారు.
హైవేలపై, ఇరుకుసందుల్లో పెట్టి ప్రజల ప్రాణాలు పోతుంటే ఊరుకుని చూడాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు పర్మిషన్ తో నిర్ణీత ప్రాంతంలో సభలు పెట్టుకోవచ్చని, దానికి అధికారులు పూర్తి సహకారం అందిస్తారని పేర్కొన్నారు. అంతేకానీ తనను అడ్డుకోవడం కోసమే ప్రభుత్వం జీవో తీసుకువచ్చినట్లు కుప్పంలో హైడ్రామాకు చంద్రబాబు తెరలేపారని విమర్శించారు. అధికారం కోసం ఎంతమందినైనా చంపేందుకు వెనకాడడని ఆరోపించారు. సొంత నియోజకవర్గంలోనే చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఉండి చేయలేని పనిని వైసీపీ ప్రభుత్వం చేస్తుందని వివరించారు. జీవో కేవలం ప్రతిపక్షానికే కాదని, అందరికీ వర్తిస్తుందని ఆయన చెప్పారు. దీనికి ఎవరూ అతీతులు కారన్నారు. భావోద్వేగ రాజకీయాలకు తప్ప శాశ్వత రాజకీయాలకు చంద్రబాబు పనికిరాడని విమర్శించారు.
14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కేవలం దుప్పట్లు పంచేందుకు మీటింగ్ నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ జీవో ఉద్దేశం ప్రజలకు రక్షణ కల్పించడమే తప్ప, ఎలాంటి అదనపు నియంత్రణలు లేవని స్పష్టం చేశారు. కందుకూరు, గుంటూరు ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం తరఫున ఇప్పటికే రూ. 2 లక్షలు ఇవ్వడం జరిగిందని, వారి కుటుంబాలను ప్రభుత్వం అన్నీ విధాలా ఆదుకుంటుందని అన్నారు. సీఎం జగన్ గురించి బాబు అవాకులు, చవాకులు మాట్లాడటం చూస్తుంటే బాబుకు
పిచ్చెక్కిందేమో అనిపిస్తోందని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. పిచ్చికుక్క ఎలా అరుస్తుందో అలా బాబు అరుస్తున్నాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి చంద్రబాబు శనిలా దాపురించాడని మండిపడ్డారు. తమ ప్రభుత్వానికి జనం ప్రాణాలు ముఖ్యమని, అందుకే జీవో తెచ్చామని, అంతేకాని బాబును, వారాహిని, దత్తపుత్రుడి తమ్ముడిని(యువగళం) ఆపడానికి కాదని రాంబాబు చెప్పారు. జగన్ యాత్రల్లో ఎక్కడా అపశ్రుతులు దొర్లలేదని, బాబు యాత్రల్లో మాత్రమే రక్తపు మరకలంటుతున్నాయని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.