Khammam : మరో 30 ఏళ్ల వరకు.. పామాయిల్ సాగుకు ఢోకా లేదు.. మంత్రి ఎర్రబెల్లి భరోసా
Khammam : తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. తాజాగా ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పామాయిల్ పంట సాగు చేసే రైతులకు భరోసా ఇచ్చారు. మరో 30 ఏళ్ల వరకు పామాయిల్ సాగుకు ఎటువంటి ఢోకా లేదని.. పామాయిల్ గెలల ధరకు భరోసా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించిన మంత్రి.. అశ్వారాపుపేట, దమ్మపేట మండలాల్లో రైతులు సాగు చేసిన పామాయిల్ పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా పామాయిల్ సాగు గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు.
పామాయిల్ సాగుకు మన దగ్గర ఎటువంటి ఢోకా లేదు. రైతులు కాళ్లకు, చేతులకు బురద అంటించుకోవాల్సిన అవసరం లేకుండా.. ఈ సాగును చేస్తున్నారు. పామాయిల్ మొక్కలను నాటడంతో పాటు.. గెలలు వేసి కాతకు వచ్చే వరకు ఒక్క ఎకరాకు 36 వేల రూపాయల ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. పామాయిల్ సాగు రైతులను ఆదుకోవడం కోసమే.. ప్రభుత్వం ఆ ఖర్చును భరిస్తోందని ఎర్రబెల్లి వెల్లడించారు.
రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పామాయిల్ పరిశ్రమను నెలకొల్పబోతున్నాం. అలాగే.. పామాయిల్ కు కూడా రైతు బంధును అందిస్తున్నాం. రైతులు.. పామాయిల్ సాగును నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. పామాయిల్ రైతులను ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మద్దతు ఎప్పటికీ ఉంటుంది అని మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు.