KTR : మొదటిసారి ఈటల విషయంలో కేటీఆర్ ఇన్వాల్వ్..!
KTR : తెలంగాణలో ప్రస్తుతం కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. అందుకే మే 12 నుంచి తెలంగాణలో 10 రోజుల పాటు లాక్ డౌన్ ను విధించింది తెలంగాణ ప్రభుత్వం. రేపటి నుంచి ఉదయం 6 నుంచి ఉదయం 10 గంటల వరకు మాత్రమే సడలింపు ఉండగా… మిగితా 20 గంటలు మొత్తం లాక్ డౌన్ ఉండనుంది. అలాగే మరోవైపు కరోనా పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. అయితే.. ప్రస్తుతం తెలంగాణలో వైద్యారోగ్య శాఖ మంత్రి లేరు. సీఎం కేసీఆర్ ఆ శాఖను తనకు బదిలీ చేసుకున్నా… ఆయన ముఖ్యమంత్రి కావడంతో వైద్యారోగ్య శాఖకు సంబంధించిన పనులను చూసుకోలేకపోతున్నారు. దానికి సంబంధించి సమీక్షలు, ఇతర మీటింగ్ లు నిర్వహించడం.. కరోనాకు సంబంధించిన అప్ డేట్స్ ను చెక్ చేయడం.. కరోనా రోగులకు సరైన వైద్యం అందించడం.. ఇవన్నీ సమస్యలు ఓవైపు ఉండటంతో… ప్రస్తుతం సీఎస్ సోమేశ్ కుమార్.. వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.
అయినప్పటికీ.. వైద్యారోగ్య శాఖను ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎవరికైనా అప్పగించాలని సీఎం కేసీఆర్ యోచించారట. కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. ఖచ్చితంగా ఆ శాఖ బాధ్యతలను ఎవరికైనా అప్పగించాలని భావించి.. ఆ బాధ్యతలను పరోక్షంగా మంత్రి కేటీఆర్ కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. దీంతో మొదటి సారి మంత్రి కేటీఆర్.. ఈటల రాజేందర్ శాఖ వ్యవహారంలో ఇన్వాల్వ్ అవబోతున్నారు.
KTR : వ్యాక్సినేషన్ ప్రక్రియపై మంత్రి కేటీఆర్ సమీక్ష
ఇప్పటికే సీఎస్ సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో వైద్యారోగ్య శాఖకు సంబంధించిన సమీక్షలు నిర్వహించారు. తాజాగా.. మంత్రి కేటీఆర్ కు ఆ బాధ్యతలు పరోక్షంగా అప్పగించడంతో… ఎప్పటికప్పుడు కరోనా రోగులకు మందులు, ఇతర వ్యాక్సిన్లను సమకూర్చడంతో పాటు.. వెంటనే సరఫరా చేయడం కోసం.. మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్స్ నియామకానికి తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఈ టాస్క్ ఫోర్స్ లో కరోనా ప్రత్యేకాధికారి రాజశేఖర్ రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా సభ్యులుగా ఉండనున్నారు.ఇక ఇప్పటి నుంచి వైద్యారోగ్య శాఖకు సంబంధించిన అన్ని మీటింగ్ లు, ఇతర పనులను, కరోనా రోగులకు అందుతున్న చికిత్స వివరాలు, ఇతర సౌకర్యాలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ, ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా, మెడికల్ కిట్స్, వెంటిలేటర్లు, బెడ్స్ కొరత లేకుండా చూడటం.. ఇలా అన్ని కీలక అంశాలను మంత్రి కేటీఆర్ పర్యవేక్షించనున్నారు.