Avinash Reddy : ఎంపీ అవినాష్ రెడ్డి Vs సీబీఐలో భారీ ట్విస్ట్..!
Avinash Reddy : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ హత్య కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారిస్తున్న విషయం తెలిసిందే. సీబీఐ విచారణ ముగిసినప్పటికీ.. మళ్లీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డికి చెప్పినట్టు తెలుస్తోంది. శనివారం నాడు హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. సీబీఐ కార్యాలయం నుంచి బయటికి వచ్చిన తర్వాత అవినాష్ రెడ్డి మీడియాతోనూ మాట్లాడారు. సీబీఐ అధికారులు ఇచ్చిన నోటీసు ఆధారంగా తాను విచారణకు హాజరు అయినట్టు అవినాష్ రెడ్డి మీడియాకు తెలిపారు.
అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానం చెప్పినట్టు అవినాష్ రెడ్డి తెలిపారు. సీబీఐ అధికారులకు ఉన్న అనుమానాలన్నింటినీ నివృత్తం చేసినట్టు అవినాష్ రెడ్డి చెప్పారు. ఎప్పుడు విచారణకు రమ్మన్నా వస్తానని తాను సీబీఐ అధికారులకు చెప్పినట్టు అవినాష్ స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ప్రజలకు తెలియజేయాలని తాను సీబీఐ అధికారులను కోరానని, తన విచారణ సమయంలో వీడియో రికార్డు చేసి అది లైవ్ ప్రసారం చేయాలని సీబీఐ అధికారులను కోరానని.. కాని వాళ్లు ఒప్పుకోలేదని అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. కొన్ని మీడియా సంస్థలు, పత్రికలు కావాలని నాపై దుష్ప్రచారం చేస్తున్నాయి.
Avinash Reddy : కావాలని నాపై దుష్ప్రచారం చేస్తున్న కొన్ని పత్రికలు
సీబీఐ వాళ్లు ఎన్నిసార్లు నన్ను విచారణ చేసినా నాకేం భయం లేదు. నేనే తప్పు చేయలేదు.. అవసరమైతే మళ్లీ పిలుస్తామన్నారు. మీరు ఎప్పుడు పిలిచానా వస్తా అని చెప్పి వచ్చేశా అని సీబీఐ అధికారులకు చెప్పానని అవినాష్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ కేసులో 248 మందిని సీబీఐ విచారించింది. వాళ్ల వాంగ్మూలాన్ని కూడా సేకరించింది. ఆ వాంగ్మూలం ఆధారంగానే సీబీఐ.. అవినాష్ రెడ్డిని కూడా ప్రశ్నించింది. నిజానికి వివేకా హత్య కేసుకు సంబంధించి.. సీబీఐ దర్యాప్తు మూడేళ్లుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ కేసు ఎటూ తేలలేదు. హైకోర్టు.. ఈ కేసును సీబీఐకి అప్పగించడంతో సీబీఐ రంగంలోకి దిగి.. కేసుపై దర్యాప్తు చేస్తోంది.