TDP : వరద బురదలో తెలుగు తమ్ముళ్ళు.. అవసరమా ఇదంతా.?
TDP : తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు, పార్టీ అధినేత చంద్రబాబుతో కలిసి గోదావరి వరదల నేపథ్యంలో, వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడ ప్రభుత్వం తగు రీతిలో సహాయక చర్యలు చేపట్టలేదంటూ టీడీపీ ఇప్పటికే విమర్శించేసింది.. నేరుగా, ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడి నుంచి కూడా ప్రభుత్వం మీద బురద చల్లేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నించింది. కానీ, విధి వెక్కరించింది. గోదావరి నది వరద ఎక్కువగా వుండడంతో, టీడీపీ నేతలు ప్రయాణించిన బోట్లు కాస్తా బోల్తా పడ్డాయి. పెద్దగా లోతు లేకపోవడం, భద్రతా సిబ్బంది, మత్స్యకారులు అప్రమత్తమవడంతో పెను ప్రమాదం తప్పింది. బోల్డంతమంది టీడీపీ నాయకులు, గోదావరి నీళ్ళలో పడిపోయారు.
రాజోలు లంక ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రాణాల అరచేత పట్టుకుని.. బతుకు జీవుడా.. అంటూ కొందరు టీడీపీ నేతలు బయటకు వచ్చారు. ఆ లిస్టులో దేవినేని ఉమామహేశ్వరరావు సహా, టీడీపీకి చెందిన పలువురు ముఖ్య నేతలున్నారు. సాధారణంగా ఇలాంటి యాత్రల్లో స్థానిక టీడీపీ క్యాడర్ అప్రమత్తంగా వుంటుంది, తగిన ఏర్పాట్లు కూడా చేస్తుంది. మరోపక్క, ప్రతిపక్ష నేత పర్యటిస్తున్నారు గనుక, ప్రోటోకాల్ ప్రకారం పోలీసు యంత్రాంగం కూడా తగిన భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతుంటుంది. కానీ, కార్యకర్తల మితిమీరిన ఉత్సాహం, స్థానిక నాయకుల అతి.. వెరసి, ఈ దుర్ఘటన చోటు చేసుకుందని సమాచారం.!
‘ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది.. తగిన భద్రతా ఏర్పాట్లు చేయలేదు..’ అంటూ పలువురు టీడీపీ నేతలు, తాము ఎదుర్కొన్న ప్రమాదంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రమాదకరమైన ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు అప్రమత్తంగా వుండడం, అధికారులు సూచించే సూచనలు పాటించడం మానేస్తే ఎలా.? మొత్తమ్మీద, చంద్రబాబు వరద యాత్ర కాస్తా, తెలుగు తమ్ముళ్ళకు బురద యాతనగా మారిపోయింది. అంతే కాదు, ప్రాణాలరచేత పట్టుకుని బిక్కుబిక్కుమనాల్సిన దుస్థితి ఏర్పడింది. చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్లు.. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణహానికీ దారి తీయలేదు.