Omicron : భారత్ లో కరోనా మూడో దశ ప్రారంభం.. ఏప్రిల్ నాటికి దేశమంతా పాకనున్న ఒమిక్రాన్ వేరియంట్..!
Omicron : భారత్ లో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. వారం వ్యవధిలో దేశంలో పెరుగుతున్న కేసులు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. నాలుగురోజుల క్రితం మూడో వేవ్ వచ్చేసిందని నిపుణులు హెచ్చరికలు నిజమన్న విషయం తాజా పరిణామాల్ని చూస్తే ఇట్టే అర్థమైపోతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నమోదవుతున్న కరోనా కేసుల్లో సగానికిపైగా ఒమిక్రాన్ కేసులే ఉండడం..
మూడోదశకు సంకేతమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జాతీయ సాంకేతిక సలహా గ్రూప్.. ఎన్టీఏజీఐ ఛైర్‌పర్సన్ డాక్టర్ ఎన్కే ఆరోరా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.మహమ్మారి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. అయితే ఒమిక్రాన్ కేసుల్లో చాలా వరకు లక్షణాలు లేనివి, తక్కువ వ్యాధి తీవ్రత ఉన్నవేనని డాక్టర్ ఆరోరా తెలిపారు.
ఇదిలా ఉండగా దేశంలో కోవిడ్ కేసులతో పాటు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు దేశంలో రోజు రోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్రలతో పాటు పలు రాష్ట్రాలలో కేసులు పెరుగుదల గణనీయంగా ఉంది. కరోనా డెల్టా వేరియంట్ కంటే ఎక్కువ ఇన్ఫెక్షియస్ వేరియంట్ వెర్షన్‌గా ఒమిక్రాన్ ఉంది. కేసుల సంఖ్య ఇలాగే పెరుగుతూ పోతే మరో మూడు నెలల్లో అనగా ఏప్రిల్ నాటికి ఒమిక్రాన్ భారత్ అంతా పాకే సూచనలు కనిపిస్తున్నాయి.