Pawan Kalyan : పవన్ కళ్యాణ్ లెక్క మారిందా? డబ్బుమయమైపోయిన రాజకీయాలపై విరక్తి వచ్చేసిందా?
Pawan Kalyan : ఈరోజుల్లో రాజకీయాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాలా? రాజకీయాల్లోకి వెళ్లాలని.. ఏదైనా సమాజం కోసం చేయాలని చాలామంది ఎన్నో కలలు గంటారు. కానీ.. వాళ్లకు తెలియదు కదా.. రాజకీయాలు మొత్తం ఇప్పుడు డబ్బుమయం అయిపోయాయని. రాజకీయాల్లో రాణించాలంటే డబ్బుతోనే పని. రూపాయి లేకపోతే ఏ పనీ అక్కడ జరగదు. నీతివంతమైన రాజకీయాలకు ఎప్పుడో అందరూ నీళ్లొదిలేశారు. ఇప్పుడు అసలైన రాజకీయాలంటే ఏంటో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కూడా అర్థం అవుతున్నట్టున్నాయి. ఎందుకంటే..
ఎన్నికల్లో డబ్బు వినియోగంపై పవన్ తనకంటూ కొన్ని రూల్స్ పెట్టుకున్నాడు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఆయనకు ఆయన గిరి గీసుకున్నారు. కానీ.. ఇప్పుడు అవన్నీ ఉత్తవే అని ఆయనకు హితబోధ కలిగినట్టుంది. గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన వాళ్లలో చాలామంది డబ్బులు ఖర్చు చేయలేదు. దానికి కారణం.. పవన్ నుంచి వాళ్లకు డబ్బు అందకపోవడం, వాళ్ల దగ్గర కూడా అంత డబ్బు లేకపోవడం. ఏదో కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ కు ఉన్న ఆదరణతో కొన్ని ఓట్లు పడ్డాయి తప్పితే.. ఈరోజుల్లో డబ్బులు పంచనివాళ్లకు ఎవరు ఓట్లు వేస్తున్నారు?
Pawan Kalyan : ఎన్నికల్లో ఖర్చు చేయండి అని నేతలకు చెప్పిన పవన్
ఇటీవల జరిగిన జనసేన ఐటీ విభాగం ముగింపు సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ఎన్నికల్లో ఖర్చు చేయండి అని నేరుగా చెప్పేశారు. జీరో బడ్జెట్ రాజకీయం చేయమని తానెప్పుడూ చెప్పలేదన్నారు. కాకపోతే.. ఓట్లు కొనకూడని రాజకీయమే చెప్పానన్నారు. 2019 ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన వాళ్లలో పెద్ద పెద్ద నాయకులు కూడా రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా పోటీ చేశారని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
అయితే.. ఇక నుంచి పోటీ చేసేవాళ్లు.. ప్రత్యర్థులకు దీటుగా ఎన్నికల్లో ఖర్చు చేయాలని పవన్ తెలిపారు. అలా అయితేనే ఎన్నికల్లో రాణిస్తామన్నారు. నిజానికి.. జనసేన పార్టీ అంటేనే ఎన్నికల్లో ఖర్చు చేయని పార్టీ అని జనాల్లో ముద్ర పడిపోయింది. కానీ.. వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. పవన్ మీద అభిమానం ఉన్నా.. ఆయన్ను దేవుడిగా భావించేవాళ్లు అయినా ఎవ్వరైనా ఆయనను అభిమానిస్తారు కానీ.. ఓటు వేయరు కదా. డబ్బులు ఇచ్చిన వాళ్లే ఓట్లేస్తున్నారు. అందుకే జనసేన పార్టీ ఒకటి రెండు స్థానాలకే పరిమితం అవుతోంది. అవన్నీ పవన్ కు ఇప్పుడు అర్థం అయినట్టున్నాయి. అందుకే నీతివంతమైన పాలిటిక్స్ అంటే ఈ జనరేషన్ లో కుదరని పని అని అనుకొని.. ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టండి అని నేతలకు దిశానిర్దేశం చేశారు పవన్.