అమరావతి జనభేరి సభలో పవన్ కళ్యాణ్ మిస్సింగ్? ఆహ్వానం అందలేదా?
ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ అంటే అమరావతి జనభేరి సభే. అవును.. అమరావతి జనభేరి సభలో ఎక్కవగా హడావుడి చేసింది టీడీపీ పార్టీనే. టీడీపీ ముందుండి జనభేరిని విజయవంతం చేసింది. కాకపోతే టీడీపీ పార్టీ కండువాలను కాకుండా.. అమరావతి ఉద్యమ కండువాలను కప్పుకొని ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఈ సభలో హైలెట్ అంటే చంద్రబాబు నాయుడే.
టీడీపీ.. అమరావతి ఉద్యమానికి పూర్తిస్థాయిలో మద్దతు తెలిపినప్పటికీ.. బీజేపీ, వామపక్ష పార్టీలు కూడా ఏదో తాము కూడా మద్దతు ఇస్తున్నాము అన్నట్టుగా వ్యవహరించాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఏదో నామ్ కే వాస్తే హాజరయింది.
ఇక.. ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అసలు వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ నుంచి మాత్రం ఎవ్వరూ హాజరుకాలేదు. అసలు.. జనసేన పార్టీ అమరావతి ఉద్యమానికి మద్దతు ఇస్తుందా? లేదా? అనే విషయం మాత్రం పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది.
నిజానికి.. అమరావతి ఉద్యమం వెనుక ఉన్నది టీడీపీ పార్టీనే. అది జగమెరిగిన సత్యం. మూడు రాజధానుల ప్రకటనను టీడీపీతో పాటు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. అప్పట్లో పవన్ కళ్యాణ్ కూడా జై అమరావతి అని నినదించారు. అమరావతికి సంబంధించి ఏపీ హైకోర్టులో జనసేన పిటిషన్ కూడా దాఖలు చేసింది.
కానీ.. తీరా ఇప్పుడు చూస్తే.. అసలు జనసేన పార్టీ నేతలు కానీ.. అధినేత కానీ దరిదాపుల్లో కూడా రాలేదు. ఎవ్వరూ కనిపించలేదు.
ఆహ్వానం అందలేదా?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు జనభేరి సభకు ఆహ్వానం అందలేదు.. అనే వార్తలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. అమరావతి రైతులు అన్ని పార్టీలకు ఆహ్వానం అందించారట. అంటే.. జనసేనకు కూడా ఆహ్వానం అందింది.. వాళ్లకు ఆహ్వానం అందలేదు అనేది అవాస్తవం అని ఉద్యమ రైతులు చెబుతున్నారు. అంటే.. ఆహ్వానం అందినా పార్టీ లైట్ తీసుకుందంటే.. దానికి కారణం ఏంటి.. అనే విషయం తెలియాల్సి ఉంది.
బాబు పక్కన కూర్చోవాల్సి వస్తుందనేనా?
ఒకవేళ జనసేన పార్టీ అధ్యక్షుడి హోదాలో పవన్.. జనభేరి సభకు వెళ్తే.. అక్కడ చంద్రబాబు పక్కన కూర్చోవాల్సి వస్తుందని.. వెళ్లి ఆయన పక్కన కూర్చుంటే మళ్లీ ఏపీ ప్రజల్లో లేనిపోని అనుమానాలు.. ఎందుకు ఇదంతా అని అనుకున్నారో ఏమో.. అందుకే పవన్ లైట్ తీసుకొని ఉంటారు.. అనే వార్తలూ వినిపిస్తున్నాయి.
మరోవైపు తిరుపతి ఉపఎన్నిక కూడా త్వరలో జరగబోతోంది. ఇప్పుడు జై అమరావతి అంటే.. రాయలసీయ ప్రజలు గుర్రుమంటారు. పార్టీ మొత్తాన్ని వాళ్లు పక్కన పెట్టేస్తారు. ఎందుకు మనకు గొడవ అని అనుకున్నారో ఏమో.. అందుకే పవన్ కళ్యాణ్.. అమరావతి ఉద్యమానికి అందుకే దూరంగా ఉన్నారు.. అని సమాచారం.