Pawan Kalyan : ముందే కూస్తున్న కోయిల.. పవన్ కళ్యాణ్ యాత్రపై పెద్దల మాట
Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్నాడు. ఒక వైపు తెలుగు దేశం మరియు బీజేపీలతో కలిసి వెళ్లబోతున్నట్లుగా హింట్ ఇవ్వడంతో పాటు రాష్ట్ర వ్యాప్త యాత్రకు పవన్ కళ్యాణ్ సిద్దం అయ్యాడు. ఆరు నెలల పాటు సాగబోతున్న యాత్ర కోసం పవన్ కళ్యాణ్ టీమ్ ఏర్పాట్లు షురూ చేసినట్లుగా సమాచారం అందుతోంది. రాజకీయ వర్గాల్లో మాత్రం పవన్ యాత్ర విషయంలో పెదవి విరుపులు కనిపిస్తున్నాయి.. ఆయన ముందే కూసిన కోయిల అంటున్నారు.
ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాల సమయం ఉంది. ఈ రెండు సంవత్సరాల సమయంలో అధికార పార్టీ కి ఎంతో గుర్తింపు.. బలం దక్కనుంది. ఆ విషయం లో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో ఏపీ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. పైగా మరిన్ని అభివృద్ది కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నారు. కనుక ఖచ్చితంగా ఏపీలో ప్రతిపక్షాలను జనాలు నమ్మే పరిస్థితి లేదు.
జనసేన పార్టీ ఏర్పాటు అయ్యి ఎనిమిది సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు పార్టీ క్యాడర్ ను నిర్మించుకోవడంలో పవన్ విఫలం అయ్యాడు. పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది.. అసలు ఎవరితో పొత్తు ఉంటుందనే క్లారిటీ లేదు. గత ఎన్నికల్లో కనీసం పవన్ కూడా గెలవక పోవడంతో ఈసారి అయినా ఆయన తన స్థానంను గెలుచుకుంటాడా.. ఆయన పోటీ చేసేది ఎక్కడ నుండి అంటూ ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం లేదు కాని ఎన్నికలు రెండేళ్లు ఉండగానే ఈ యాత్రలు ఎందుకు పవన్ అంటూ స్వయంగా పవన్ అభిమానులు మరియు జన సైనికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.