కర్ఫ్యూ రూల్స్ ను ఉల్లంఘించిన యువకుడు.. కన్నకొడుకును కూడా వదలని పోలీస్
ఏపీలో ప్రస్తుతం కర్ఫ్యూ కొనసాగుతోంది. ఏపీలో కరోనా కేసులు విపరీతంగా నమోదు అవుతున్నాయి. నిజానికి రాత్రి పూట కర్ఫ్యూను ఏపీ ప్రభుత్వం విధించినా.. కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోగా… రోజుకు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. అలాగే.. వందల సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో కరోనా నియంత్రణ కోసం మధ్యాహ్నం 12 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూను విధించింది ఏపీ ప్రభుత్వం. అంటే ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే షాపులను తెరుచుకోవాలి. నిత్యావసర సరుకుల కోసం బయటికి వెళ్లాలి. మధ్యాహ్నం 12 నుంచి తెల్లారి ఉదయం 6 వరకు ఏపీ వ్యాప్తంగా కర్ఫ్యూ ఉంటుంది. దీంతో పోలీసులు కూడా కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నారు. మధ్యాహ్నం 12 దాటితే ఎవరైనా బయట కనిపిస్తే వెంటనే వారికి ఫైన్ వేయడమో.. లేక బడితె పూజ చేయడమో చేస్తున్నారు.
ఏది ఏమైనా ఎవరో ఒకరు చిన్న చిన్న కారణాలతో బయట తిరుగుతూనే ఉన్నారు. ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకొని బయట రోడ్ల మీద తిరుగుతున్నారు జనాలు. దీంతో పోలీసులు తమ లాఠీలకు పని చెప్పాల్సి వస్తోంది. కేవలం ఎమర్జెన్సీ వాహనాలకు, ఇతర వైద్య సేవలకు వెళ్లే వాళ్లు, మీడియాకు, కూరగాయలు, ఇతర ట్రాన్స్ పోర్ట్ వాహనాలకు మాత్రమే పర్మిషన్ ఉంది. అయినప్పటికీ.. కొందరు కావాలని బయటికి వస్తున్నారు. పోలీసుల చేతుల్లో తన్నులు తింటున్నారు.
సీఐ కొడుకును అంటూ బయట తిరిగిన యువకుడిని సొంత తండ్రే ఏం చేశాడంటే?
తాజాగా.. చిత్తూరు జిల్లాలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకున్నది. చిత్తూరు జిల్లా పలమనేరులో సీఐ జయరామయ్య నేతృత్వంలో పోలీసులు కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. కర్ఫ్యూ సమయంలో ఎవరు బయట కనిపించినా.. ఫైన్ వేస్తున్నారు. అయితే.. ఓ యువకుడు కూడా బయట కనిపించడంతో.. ఓ కానిస్టేబుల్ ఆ యువకుడిని తీసుకొని.. సీఐ జయరామయ్య దగ్గరికి తీసుకొచ్చాడు.
తీరా చూస్తే.. ఆయువకుడు ఎవరో కాదు.. సీఐ జయరామయ్య కొడుకు. సారీ సార్.. మీ కొడుకు అని తెలియక తీసుకొచ్చా.. అని కానిస్టేబుల్ ఏదో చెప్పబోగా… చట్టం ముందు అందరూ సమానులే. కర్ఫ్యూ సమయంలో ఎవ్వరూ బయటికి రాకూడదు. ఫైన్ కట్టు అంటూ 125 రూపాయల ఫైన్ కట్టించుకున్నాడు ఆ సీఐ. ఇంకోసారి బయట తిరిగినే కఠిన చర్యలు తీసుకుంటాం.. అంటూ సొంత కొడుకునే హెచ్చరించి మరీ పంపించాడు ఆ సీఐ. సీఐ చేసిన పనికి అక్కడి స్థానికులు తెగ మెచ్చుకుంటున్నారు. పోలీస్ అంటే ఇలా ఉండాలి అంటూ ఆయన్ను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.