Raghu Rama Krishna Raju : ఎంపీ పదవిని రఘు రామ కృష్ణంరాజు కోల్పోవాల్సిందేనా.?
Raghu Rama Krishna Raju : ఇప్పటిదాకా ఏ బీజేపీ అంట తనకు వుందని వైసీపీ రెబల్ ఎంపీ రఘు రామ కృష్ణ రాజు చెబుతూ వస్తున్నారో, ఆ ‘లింకు’ తెగిపోయినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. సొంత నియోజకవర్గం నర్సాపురంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తే, ఆ కార్యక్రమానికి స్థానిక ఎంపీ హోదాలో రఘురామకృష్ణరాజు హాజరు కాలేకపోవడం ఆయన్ని రాజకీయాల్లో ‘జీరో’ని చేసేసింది. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన రఘురామ, ఆ తర్వాత పార్టీకి దూరమై, పార్టీ మీద బురద చల్లుతూ వస్తున్నారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే కావొచ్చు. వైసీపీ ఆయనకు నచ్చకపోవచ్చు.
పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు.. పోనీ, అలా వెళ్ళకపోతే.. తన పని తాను చేసుకుపోవచ్చు. కానీ, పదే పదే.. ఒకటే పని. వైసీపీని విమర్శించడం. దానికోసం ఆయన ‘రచ్చబండ’ అంటూ ఓ చచ్చు కార్యక్రమాన్ని అను నిత్యం ఏర్పాటు చేసుకుంటున్నారు. టీడీపీ అనుకూల మీడియాకి ఆయనో ‘బకరా’లా దొరికినట్టున్నారు. లేకపోతే, కేవలం ఆ మీడియా మాత్రమే ఆయన్ని ఎందుకు వాడుకుంటుంది.? టీడీపీ అనుకూల మీడియా దెబ్బకి చాలామంది రాజకీయ జీవితాలు సమాధి అయిపోయినమాట వాస్తవం.
అది తెలిసీ, రఘురామ ఆ పచ్చ మీడియాకి ఎలా చిక్కారో ఏమో.! తన గురించి తాను చాలా ఎక్కువ ఊహించేసుకోవడం రఘురామకి అలవాటే. కానీ, ఈసారి ఆయన బొక్కబోర్లా పడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ పట్టించుకోలేదు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా లెక్క చేయలేదు. ఇంకో రెండేళ్ళపాటు ఆయన సొంత నియోజకవర్గానికి వెళ్ళే అవకాశమూ కనిపించడంలేదు. అసలంటూ ఆయనకు ఎంపీ పదవి అప్పటిదాకా వుండాలి కదా.? రఘురామ మీద అనర్హత వేటు వేయించేందుకు వైసీపీ మరింతగా ప్రయత్నాలు ముమ్మరం చేయనుంది. అతి త్వరలో ఆ ముచ్చటా తీరిపోనుందట.