రఘురామ ఎఫెక్ట్.. ఇప్పుడు మాట్లాడండ్రా అబ్బాయిలు
ఏ పార్టీలో అయినా అసమ్మతి అనేది చాలా కామన్ గా ఉంటుంది. ముఖ్యంగా అధికారంలో ఉన్న సమయంలో అందరి మాటలు.. నిర్ణయాలు ఒకే మాదిరిగా ఉండవు. కనుక అసమ్మతి అనేది చాలా సహజంగానే వస్తుంది. ఆ అసమ్మతిని ఆరంభంలోనే తుంచి వేయకుంటే తదుపరి ఎన్నికల సమయంలో ఆ అసమ్మతి వల్లే భారీ నష్టం తప్పదు. ఇది గతంలో చాలా సార్లు నిరూపితం అయ్యింది. అందుకే ఇప్పుడు ఏ ప్రాంతీయ పార్టీ అయినా అసమ్మతిని వెంటనే కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇటీవల టీఆర్ఎస్ లో ఈటెల వ్యవహారం మరువక ముందే వైకాపా ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్ట్ ను చూడవచ్చు. ఏపీ ప్రభుత్వంకు వైకాపాకు ఈయన గ త కొన్నాళ్లుగా వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నాడు. అసమ్మతి నేతలకు ఇదో చెంప దెబ్బ అన్నట్లుగా వైకాపా నాయకులు చెబుతున్నారు.
రఘురామ తర్వాత మరెవ్వరు..
ఎంపీ రఘురామ కృష్ణంరాజు దారిలోనే కొందరు వైకాపా నాయకులు సొంత పార్టీపై విమర్శలు చేసే అవకాశాలు ఉన్నాయంటూ ముందు నుండే అనుమానాలు ఉన్నాయి. ఎంపీ తో పాటు వారు కూడా ఉంటారని అధికార పార్టీకి సమాచారం అందింది. అందుకే ఇప్పుడు రఘురామ అరెస్ట్ తో వారిలో కలవరం మొదలు అయ్యింది. గప్ చుప్ గా వైకాపాలో కొనసాగడం మినహా వారికి మరో ఆప్షన్ లేకుండా పోయింది. అందుకే ఈ సమయంలో వారికి దడ మొదలు అయ్యిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జగన్ కు ఎదురు వెళ్తే పరిస్థితి ఏంటీ అనేది రఘురామ సంఘటన నిదర్శణంగా నిలుస్తుంది. కనుక మరెవ్వరు కూడా ఆయన తర్వాత అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే సాహసం చేయక పోవచ్చు.
తస్మాత్ జాగ్రత్త…
గత కొన్ని నెలలుగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఎంపీ ని అరెస్ట్ చేయించడం ద్వారా మనసులో ప్రభుత్వంపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కోపం ఉన్న వారికి వార్నింగ్ ఇచ్చినట్లుగా అయ్యింది. ఇప్పుడు చెప్పండి ఏమైనా విమర్శలు ఉంటే అంటూ వైకాపా మంత్రులు కొందరు కౌంటర్ వేస్తున్నారు. అసమ్మతి నేతలు తమ మనసులోనే అసమ్మతి ఉంచుకోవాల తప్ప బయటకు చెప్తే మాత్రం కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని అంటున్నారు. రఘురామ ఎంపీ కనుక ట్రీట్‌మెంట్ సింపుల్ గానే ఉంది. అదే రాష్ట్ర నాయకుడు లేదా ఎమ్మెల్యే అయితే పరిణామాలు సీరియస్ గా ఉంటాయి. కనుక తస్మాత్ జాగ్రత్త అంటూ వైకాపా నాయకులు అసమ్మతి నేతలను హెచ్చరిస్తున్నారు.