రజనీకాంత్ పార్టీ పేరు, ఎన్నికల గుర్తు ఖరారు..?
ప్రస్తుతం తమిళనాడు ఎన్నికలే దేశవ్యాప్తంగా హాట్ టాపిక్. అందులోనూ ఈసారి సూపర్ స్టార్ రజనీకాంత్ ఎన్నికల్లో పోటీ చేయడమంటే ఇక మామూలుగా ఉంటుందా? రచ్చరంబోలానే కదా. అందుకే ప్రస్తుతం దేశమంతా తమిళనాడు వైపు చూస్తోంది. బీజేపీ కూడా సౌత్ ఇండియాలో పాగా వేయాలని చూస్తోంది. అందులో భాగంగానే.. తమిళనాడు రాజకీయాలపై దృష్టి పెట్టింది.
అయితే.. గత కొన్నేళ్లుగా ఊరిస్తూ వస్తున్న రజనీకాంత్… ఎట్టకేలకు పార్టీ పెడుతున్నాని ఇటీవల ప్రకటించారు. డిసెంబర్ 31న తన పార్టీ పేరు, ఎన్నికల గుర్తును వెల్లడిస్తానని తన అభిమానులకు తెలియజేశారు. వచ్చే సంవత్సరం మే నెలలోనే ఎన్నికలు ఉన్నందున.. తన పార్టీని ప్రకటించి వెంటనే ఎన్నికల కార్యచరణను ప్రారంభించనున్నారు రజనీకాంత్.
అయితే.. రజనీకాంత్ పార్టీకి ఎన్నికల గుర్తుగా సైకిల్ ను ఖరారు చేసినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ.. చివరకు రజనీకాంత్ పార్టీకి ఆటోరిక్షా గుర్తును ఎన్నికల సంఘం ఖరారు చేసిందట. అలాగే.. రజనీకాంత్ తన పార్టీ పేరును మక్కల్ సేవై కర్చీగా రిజిస్టర్ చేయించినట్టు తెలుస్తోంది.
నేను ఆటో వాడిని..
సూపర్ స్టార్ రజనీకాంత్ సౌత్ ఇండియా సూపర్ స్టార్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన కెరీర్ లో బాషా సినిమా బెస్ట్ సినిమా. తన సినిమా కెరీర్ నే మార్చేసింది ఆ సినిమా. ఆ సినిమాలో రజనీ ఆటో డ్రైవర్ గా నటిస్తాడు. నేను ఆటో వాడిని.. అంటూ పాట కూడా ఉంటుంది. మొత్తం మీద తనకు కలిసొచ్చిన ఆటోరిక్షా గుర్తుతోనే తన పొలిటికల్ కెరీర్ లో కూడా రజనీ ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది.
ఇక.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో ఉన్న మొత్తం 234 నియోజకవర్గాల్లో రజనీ కాంత్ పార్టీ పోటీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.