Draupadi Murmu : రాష్ట్రపతి వర్సెస్ రాష్ట్రపత్ని: కాంగ్రెస్, బీజేపీ నిస్సిగ్గు రచ్చ.!
Droupadi Murmu : అసలు చట్టసభలు ఎందుకున్నాయ్.? ప్రజా సమస్యలపై చర్చించడానికి కాదు, ప్రజలకు అవసరమైన చట్టాలు చేయడానికీ కాదు.! ఔను, పాలక, ప్రతిపక్షాలు తిట్టుకోవడం కోసం మాత్రమే చట్ట సభలున్నట్టుంది పరిస్థితి. లేకపోతే, పార్లమెంటు వేదికగా, ‘రాష్ట్రపతి – రాష్ట్రపత్ని’ అంశంపై రగడ చోటు చేసుకోవడమేంటి.? కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురించి ప్రస్తావిస్తూ, ‘రాష్ట్రపత్ని’ అన్నారు. జరిగిన పొరపాటుపై ఆయన చింతించారు కూడా. ఉద్దేశ్యపూర్వకంగా తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని అధిర్ రంజన్ చౌదరి చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే వాదన వినిపిస్తోంది.
నిజానికి, అధిర్ రంజన్ చౌదరి ఒకే ఒక్కసారి ఆ మాట అన్నారు. కానీ, దాన్ని పదే పదే రిపీట్ చేస్తూ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని భారతీయ జనతా పార్టీనే అవమానిస్తూ వస్తోంది. చట్ట సభల్లో పదే పదే అధిర్ రంజన్ చౌదరి వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తూ.. అసలంటూ చట్ట సభల కార్యకలాపాల్ని జరగనీయకుండా బీజేపీ సభ్యులు చేస్తూ వచ్చారు. చిత్రమేంటంటే, చట్ట సభల్లో రాజకీయాల విషయమై ఒకింత బాధ్యతాయుతంగా వ్యవహరించే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ విషయమై సంయమనం కోల్పోతున్నారు. స్మృతి ఇరానీ సహా, బీజేపీ మహిళా నేతలంతా పెద్దయెత్తున రాద్ధాంతం చేస్తుండడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
తన వ్యాఖ్యలో దొర్లిన పొరపాటు పట్ల చింతిస్తున్నాననీ, ఆ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పేందుకూ సిద్ధంగా వున్నానని అధిర్ రంజన్ చౌదరి చెబుతున్నా, ఇంత రాద్ధాంతం బీజేపీ ఎందుకు చేస్తోందన్నది ఎవరికీ అర్థం కావడంలేదు. ఇటీవలే ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎంపికయ్యారు. ఇటీవలే ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఇంతలోనే, ఆమెని ఇంతలా అవమానించాలా.? ఇంతకీ, ఇక్కడ అవమానిస్తున్నదెవరు.? కాగా, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా, అధిర్ రంజన్ చౌదరి ఉద్దేశ్యపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదనీ, అయినాగానీ క్షమాపణ చెప్పేందుకు ఆయన సిద్ధంగా వున్నారని చెప్పడం గమనార్హం. అయితే, బీజేపీ మాత్రం, ఈ వివాదం విషయంలో తగ్గేదే లే అంటోంది. అసలు బీజేపీ ఈ వివాదం నుంచి ఏం ఆశిస్తోందో ఏమో.!