RBI : ఆన్‌లైన్ లావాదేవీలపై ఆర్బీఐ కీలక మార్పులు.. ఇకనుంచి ఆ ట్రాన్సాక్షన్లకు టోకనైజేషన్ కార్డ్ ఉండాల్సిందే..!
RBI : ఆన్‌లైన్ లావాదేవీలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక మార్పులు చేసింది. వినియోగదారుల భద్రతే లక్ష్యంగా గతంలో కస్టమర్ల కార్డు వివరాలను సేవ్ చేసుకోకుండా వ్యాపారులను నియంత్రిస్తూ ఆర్బీఐ మార్గదర్శకాలు తీసుకురాగా.. రాబోయే సంవత్సరం ప్రారంభం నుంచి వినియోగదారులు తాజా మార్పులకు అనుగుణంగా ట్రాన్సాక్షన్లు చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ నిబంధనలు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని ఆర్బీఐ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
తాజా మార్గదర్శకాల ప్రకారం.. జనవరి 1 నుంచి ఏ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ లలో వినియోగదారులు తమ కార్డు వివరాలను సేవ్ చేయడానికి వీలులేదు. ఆన్‌లైన్ లావాదేవీ జరిపిన ప్రతీసారి తమ కార్డు వివరాలను కస్టమర్లు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ఇబ్బందిగా ఉందనుకుంటే.. తమ కార్డులను టోకనైజ్ చేయాల్సి ఉంటుందని అందుకు ఈ-కామర్స్ సంస్థలకు సంబంధిత కస్టమర్లు అంగీకారం తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొంది.
ఈ మేరకు వినియోగదారులు కొత్త ఏడాది ప్రారంభం నుంచి జరిపే ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్‌లలో కార్డు, వ్యక్తిగత వివరాలు, సీవీపీ నెంబర్‌ను ఎంటర్ చేసే పనిలేకుండా టోకనైజేషన్ వ్యవస్థను ఆర్బీఐ అందుబాటులోకి తెస్తోంది. కస్టమర్ల డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా ఉండేందుకే ఈ టోకనైజేషన్ అనే వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా కస్టమర్ ట్రాన్సాక్షన్ చేసిన ప్రతిసారి తన వ్యక్తిగత, కార్డ్ వివరాలు, సీవీవీ నెంబర్‌లను ఎంట్రీ చేసే అవకాశం లేకుండా చెల్లింపులు చేసుకోవచ్చు.