RS Praveen Kumar : అవునా.. ప్రవీణ్ కుమార్ అందుకే బీఎస్పీలో చేరారా?
ప్రవీణ్ పై ఆరోపణలు షురూ
RS Praveen Kumar : ఖాకీలో ఉన్నంత కాలం మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై టీఆర్ఎస్ నేతలు కాదు కదా.. ఏ పార్టీకి చెందిన నేతలు కూడా ఒక్కటంటే ఒక్క విమర్శ కూడా చేసిన దాఖలా లేదనే చెప్పాలి. ఐపీఎస్ కు వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా ప్రవీణ్ కుమార్ పై ఈగ వాలలేదనే చెప్పాలి. అయితే ఎప్పుడైతే ప్రవీణ్ కుమార్ బహుజన సమాజ్ పార్టీ లో చేరిపోయారో.. ఆ మరునాడే నేరుగా అధికార పార్టీ నుంచే ప్రవీణ్ కుమార్ పై విమర్శల దాడి మొదలైపోయింది. టీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు వరుసపెట్టి ఆర్ఎస్పీపై విమర్శల జడివాన కురిపించారు. తమ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే అధికారమే ప్రవీణ్ కు లేదన్న రీతిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఖాకీని వదిలి.. ఖద్దరేసి..
ఐపీఎస్ అధికారిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చాలా ఏళ్ల క్రితమే లాఠీ వదిలేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్ది సీఎంగా ఉన్న సమయంలో తనకు గురుకులాల సొసైటీలో పనిచేయాలని ఉందన్న ప్రవీణ్ వినతికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఫలితంగా ఐపీఎస్ అధికారి అయి ఉండి.. ఐఏఎస్ అధికారులు నిర్వర్తించే బాధ్యతలను ప్రవీణ్ చేపట్టారు. ఈ దిశగా ఆయన ఓ సరికొత్త రికార్డును సృష్టించారనే చెప్పాలి. ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కావడం, కేసీఆర్ సీఎం కావడం వెంటవెంటనే జరిగిపోయాయి. అయితే సీఎంగా ప్రమాణం చేసిన కేసీఆర్ కూడా ఆర్ఎస్పీని గురుకులాల సొసైటీ కార్యదర్శిగానే కొనసాగించారు. వెరసి ఐపీఎస్ గా ఉన్నా.. 2014 కంటే ముందుగానే ప్రవీణ్ పోలీసు కొలువును వదిలేసినట్టే లెక్క కదా. తాజాగా సర్కారీ కొలువుకే శాశ్వతంగా వదిలేసిన ప్రవీణ్.. నల్లగొండలో జరిగిన సభలో బీఎస్పీలో చేరిపోయారు. ఈ సభలో ప్రభుత్వ విధానాలపై ప్రవీణ్ కొన్ని కీలక వ్యాఖ్యలే చేశారు.
RS Praveen Kumar : అటు గాదరి.. ఇటు సైదిరెడ్డి
తమ ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు మేరకే గురుకులాల సొసైటీ కార్యదర్శిగా పనిచేసిన ప్రవీణ్.. తమ ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పిస్తారా అని అనుకున్నారో, ఏమో తెలియదు గానీ.. సోమవారం నాడే ప్రవీణ్ పై టీఆర్ఎస్ నేతల ఎదురు దాడి మొదలైపోయింది. నల్లగొండ జిల్లా తుంగతుర్తి నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న గాదరి కిశోర్ కుమార్.. ప్రవీణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దయతోనే గురుకులాల సొసైటీ కార్యదర్శిగా పనిచేసిన ప్రవీణ్.. కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించడం హాస్యాస్పదమని ఆరోపించారు. అసలు కేసీఆర్ కనికరించకుంటే.. ప్రవీణ్ ఎక్కడ ఉండేవారు అని ప్రశ్నించిన గాదరి.. గురుకులా సొసైటీతోనే ప్రవీణ్ కు పేరు ప్రఖ్యాతులు దక్కాయన్నారు. రాజ్యాధికారం అంటూ పెద్ద మాటలు చెబుతున్న ప్రవీణ్.. ఆ దిశగా లక్ష్యం చేరని బీఎస్పీలో చేరి ఏం సాధిస్తారని ప్రశ్నించారు. ఇటు గాదరి మీడియా సమావేశం ముగిసిందో లేదో..హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కూడా ప్రవీణ్ పై విరుచుకుపడ్డారు. తమ ప్రభుత్వం ఇన్నేసి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే.. మరి అదే ప్రభుత్వం దయాదాక్షిణ్యాలతో గురుకులా సొసైటీ కార్యదర్శిగా ప్రవీణ్ ఎలా కొనసాగారని ప్రశ్నించారు. గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ఉన్న సమయంలో ఇవేవీ ప్రవీణ్ కు కనిపించలేదా? అని కూడా సైదిరెడ్డి ప్రశ్నించారు.