YS Jagan : చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బహుజనులకు రాజ్యాధికారం వైయస్ జగన్
YS Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ద్వారా బడుగు బలహీన వర్గాల వారికి అత్యధిక మంత్రి పదవులను ఇచ్చారు. ఇది దేశంలోనే సామాజిక విప్లవం అంటూ రాష్ట్ర వైకాపా కార్యదర్శి.. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన మంత్రి వర్గ కూర్పుపై ముచ్చటించారు. ఈ సందర్భంగా బిసి, ఎస్టి, ఎస్సి, మైనార్టీలకు 70 శాతం మంత్రి పదవులు ఇచ్చిన ఘనత కేవలం సీఎం జగన్ మోహన్ రెడ్డి కే దక్కింది అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదని బ్యాక్ బోన్ క్లాస్ అని జగన్మోహన్ రెడ్డి నిరూపించేందుకు వారికి అత్యధిక మంత్రి పదవులు ఇచ్చినట్లుగా సజ్జల అభిప్రాయం వ్యక్తం చేశారు. పునర్వ్యవస్థీకరణలో భాగంగా నలుగురు మహిళలకు స్థానం కల్పించినట్లు పేర్కొన్నాడు. గతంలో మాదిరిగా ఈసారి కూడా ఐదుగురు ఉప ముఖ్యమంత్రులకు అవకాశం కల్పించామని.. ఆయన తెలియజేశారు. కొత్త మంత్రి వర్గం పై ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని ఇది ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో తమ పార్టీకి మరియు ప్రజలకు మేలు చేకూరుస్తుందని సజ్జల అభిప్రాయం వ్యక్తం చేశారు.మంత్రి పదవి కోల్పోయిన వారు మరియు కొత్తగా మంత్రి పదవి వస్తుందని ఆశించిన వారికి నిరాశ తప్పదు.
ఆయినా కూడా వారు పార్టీ భవిష్యత్తు కోసం ప్రజల కోసం ఈ సారికి త్యాగం చేయాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరిగిన మంత్రి వర్గ విస్తరణ ఒక రికార్డ్ అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బడుగు బలహీన వర్గాల వారికి బహుజనులకు అవకాశం ఇవ్వడం జరిగిందని, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రతి ఒక్కరు కూడా సంతృప్తిగా ఉన్నారంటూ ఆయన తెలియజేశారు. 2024 ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా మాజీ మంత్రులు ఆయా జిల్లాల్లో పని చేయాలంటూ సజ్జల విజ్ఞప్తి చేశారు.