సారూ.. ఇదేనా బంగారు తెలంగాణ..? ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఏమయ్యారు..? పోలీసు వ్యవస్థ ఎక్కడకి పోయింది..?
మానవత్వం రోజురోజుకూ మంటకలిసిపోతోందా? మనిషి ప్రాణానికి విలువే లేదా? పేదోళ్లకు అన్యాయం జరిగితే అడిగే నాయకుడే లేడా? డబ్బులు లేకుండా…. ఇంత చిన్నచూపా? గిరిజనులు అంటే అలుసా? ఒక చిన్నారిని కామాంధుడు అత్యాచారం చేసి అత్యంత దారుణంగా హత్య చేస్తే ఎందుకు వాడిని ఇప్పటి వరకు పట్టుకోలేకపోతున్నారు. ఇంత అత్యాధునిక టెక్నాలజీ వచ్చినా.. ఇంకా ఒక నేరస్థుడిని పట్టుకోవడానికి ఇంత సమయం తీసుకుంటున్నారంటే.. మన సమాజం ఎక్కడికి పోతోంది.
ముక్కు పచ్చలారని ఓ చిన్నారిని నిండా ఆరేళ్లు కూడా లేని ఆ చిన్నారిని ఓ వ్యక్తి చిదిమేస్తే.. ఎందుకు ప్రభుత్వం నోరు తెరవడం లేదు. ఎందుకు రాజకీయ నాయకుల నోరు మూగబోయింది. అసలు మీడియా ఎక్కడికి పోయింది. సెలబ్రిటీలకు చిన్న యాక్సిడెంట్ జరిగినా.. వెంటనే స్పందించే మీడియా, స్పందించే పోలీసులు.. స్పందించే ప్రభుత్వం.. పేద బిడ్డకు అన్యాయం జరిగితే ఎందుకు స్పందించడం లేదు.
పోలీసు వ్యవస్థ ఏం చేస్తోంది
ఘటన జరిగి వారం రోజులు కావస్తున్నా.. ఎందుకు ఇంకా ఆ కామాంధుడిని పట్టుకోలేకపోయారు. అసలు పోలీసు వ్యవస్థ ఏం చేస్తోంది. చట్టానికి తప్పించుకొని తిరుగుతున్న ఆ దుర్మార్గుడు.. ఇంకా ఎన్ని నేరాలు చేస్తాడో.. చూస్తూ కూర్చుంటారా? గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఏమయ్యారు. ఒక గిరిజన బిడ్డను పొట్టన పెట్టుకుంటూ చూస్తూ చోద్యం చూస్తున్నారా? ప్రభుత్వం ఎందుకు ఈ ఘటనపై వెంటనే స్పందించలేదు. నిందితుడిని పట్టుకోవడం కోసం ఎందుకు స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేయలేదు. అసలు.. ప్రభుత్వం ఒక్కసారైనా ఈ ఘటన మీద స్పందించిందా? రాజకీయ నాయకుల స్పందించారా? కనీసం.. మీడియా కూడా నిర్లక్ష్యం వహించి.. … కవరేజ్ ఇవ్వకుండా.. సెలబ్రిటీ యాక్సిడెంట్ ను హైలెట్ చేసుకొని టీఆర్పీ పెంచుకొని పబ్బం గడుపుకుంటోంది.
మంత్రులు, అధికారులు ఏం చేస్తున్నారు
రాష్ట్రవ్యాప్తంగా ఓవైపు ఆ చిన్నారిని చంపిన ఆ దుర్మార్గుడిని వెంటనే ఉరి తీయాలంటూ నిరసనలు వ్యక్తం అవుతుంటే.. ఒక్కరూ స్పందించరే. ప్రభుత్వం ఎక్కడబోయింది. సీఎం ఏం చేస్తున్నారు. ఎందుకు ఈ ఘటనపై మాట్లాడటం లేదు. మంత్రులు, అధికారులు ఏం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు ఏమయ్యాయి. మీకు ఓట్లే ముఖ్యమా? ఎన్నికలే ముఖ్యమా? ప్రజల ప్రాణాలు పట్టవా? చిన్నపిల్లలను అత్యంత దారుణంగా హించించి చంపేస్తుంటే చోద్యం చూస్తూ కూర్చుంటారా? మీడియాకు ఎలాగూ సిగ్గులేదు. కనీసం ప్రభుత్వం కూడా స్పందించకపోవడం ఏంటి? రాజకీయ నాయకులు కూడా స్పందించడం లేదు ఎందుకు. మీ ఇంట్లో వాళ్లకు కూడా ఇలాగే జరిగితే మౌనంగా ఉంటారా? ఇలాంటి సమాజంలోనే బతుకుతోంది.
పారిపోయి వారం కావస్తోంది. సిగ్గు లేదు
డబ్బులు ఉంటే పట్టించుకుంటారు.. లేకపోతే పట్టించుకోరా? పేదలకు ఏమైనా మీకు అవసరం లేదా? మీకు కేవలం వాళ్ల ఓట్లేనా కావాల్సింది. అసలు.. పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడుకోకపోవడమే ఉత్తమం. సిగ్గు చేటు పోలీసు వ్యవస్థకు.. ఆ దుర్మార్గుడు ఆ చిన్నారిని చిదిమేసి.. తప్పించుకొని పారిపోయి వారం కావస్తోంది. సిగ్గు లేదు. ఒక్క వ్యక్తిని పట్టుకోవడానికి ఇన్ని రోజుల సమయమా? ఎక్కడ పోయింది మీ టెక్నాలజీ. దేని కోసం. వాడిని పట్టుకుంటే 10 లక్షలు ఇస్తామని ప్రకటన ఒకటి. ఏం మీకు చేతగావడం లేదా? ఇంత పెద్ద పోలీసు వ్యవస్థ ఉండి ఏం లాభం.
దేని కోసం.. ఛీ.. ఛీ.. ఇలాంటి సమాజంలో పేదల బతుకులు అగమ్య గోచరంగా మారాయి. పేదలకు ఈ సమాజంలో బతికే హక్కే లేదా? మీకు దమ్ముంటే.. వాడిని 24 గంటల్లో పట్టుకొని నడి రోడ్డు మీద ఉరి తీయండి. లేకపోతే.. మీరు చేతగాని వాళ్లని ఒప్పుకోండి. అందరూ రాజకీయ నాయకుల దగ్గర్నుంచి.. ప్రభుత్వం, మీడియా, పోలీస్ వ్యవస్థ, గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు.. అందరూ చేతగాని వాళ్లమని ఒప్పుకోండి. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి.