Warangal : ఆగస్టు 9 నుంచి సెప్టెంబర్ 7 వరకు పవిత్ర మాసం
శ్రావణ మాసం అంటేనే పవిత్ర మాసం. శ్రావణ మాసం సందర్భంగా ఆగస్టు 9 అంటే ఈరోజు నుంచి సెప్టెంబర్ 7 వరకు పవిత్ర మాసంగా ఉండనుంది. ఈ సమయంలో.. దేవుడికి ఎంత దగ్గరగా ఉండి పూజిస్తే అన్ని ఫలితాలు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అలాగే.. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని.. వరంగల్ జిల్లా వ్యాప్తంగా దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి. శ్రావణ మాసంలో రోజుకో వ్రతం చొప్పున కనీసం 30 వ్రతాలు చేయాలని పురాణాలు చెబుతన్నాయి.
శుద్ధ దశమి రోజు శివలింగానికి పాలతో అభిషేకం చేస్తే ధనహాని ఉండదు. అలాగే.. శుద్ధ ఏకాదశి రోజున లక్ష్మీనారాయణడికి పంచామృతాలతో అభిషేకం చేస్తే దీర్ఘాయిష్షు కలుగుతుంది. ఈ శ్రావణ మాసంలో ఐదు సోమవారాలు వస్తున్నాయి.
అలాగే.. బోనాల పండుగను కూడా శ్రావణ మాసం రోజే జరుపుకుంటారు. నాగ పంచమిని కూడా ఇదే మాసంలో నిర్వహిస్తారు. రాఖీ పౌర్ణమి, వరలక్ష్మీ వత్రం, మంగళ గౌరీ వ్రతం, ఇలా.. పలు పవిత్రమైన వ్రతాలను కూడా ఇదే మాసంలో నిర్వహిస్తుంటారు. అలాగే.. శ్రావణ మాసంలో పూజలు చేసే వాళ్లు.. ప్రతి సోమ, శనివారాల్లో ఉపవాసాలు చేస్తుంటారు. శ్రావణ మాసంలోనే పెళ్లిళ్లు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి.
శ్రావణ మాసం సందర్భంగా.. ఆలయాల్లో భక్తుల సందడి నెలకొన్నది. ప్రతి రోజు ఒక విశిష్టమైన రోజే. సోమవారం శివుడికి అభిషేకాలు, మంగళవారం రోజున మంగళగౌరీ వ్రతాలు, శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం, శనివారం వెంకటేశ్వర స్వామి వారికి విశేష పూజలను నిర్వహిస్తారు.