తహశీల్దారే అంబులెన్స్ డ్రైవర్.. ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో.. మానవత్వంతో డ్రైవర్ గా మారిన తహశీల్దార్
ప్రస్తుతం మహమ్మారి ఎంతలా దేశాన్ని అతలాకుతలం చేస్తోందో అందరికీ తెలుసు. మహమ్మారి వల్ల చాలామంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. పనులు లేక.. చేతిలో చిల్లిగవ్వ లేక తీవ్ర యాతన అనుభవిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ నడుస్తోంది. దీంతో ప్రజలంతా ఇంట్లోనే ఉంటున్నారు. బయటికి వెళ్తే ఎక్కడ ఆ మహమ్మారి వ్యాప్తి చెందుతుందోనని భయపడుతున్నారు జనాలు. ఏపీలోనూ మధ్యాహ్నం 12 నుంచి తెల్లారి ఉదయం 6 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటోంది. నిత్యావసర సరుకుల కోసం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రం షాపులు తెరిచి ఉంటాయి. మిగితా సమయాల్లో కర్ఫ్యూను విధించారు.
ఇదిలా ఉండగా… శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ తహశీల్దార్ ఏకంగా అంబులెన్స్ డ్రైవర్ గా మారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. జిల్లాలోని సోంపేటకు చెందిన ఓ వ్యక్తికి ఊపిరి అందడం లేదు. ఆయనకు కరోనా రావడంతో గత కొన్ని రోజుల నుంచి ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతున్నాడు. అయితే.. సడెన్ గా ఆయనకు ఊపిరి అందకపోవడంతో వెంటనే కుటుంబ సభ్యులు అంబులెన్స్ కు ఫోన్ చేశారు. కానీ.. ఏ అంబులెన్స్ రాలేదు. దీంతో సోంపేట తహశీల్దార్ కు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న తహశీల్దార్.. అంబులెన్స్ ఏదీ లేకపోవడంతో.. ఉద్దానం ఫౌండేషన్ వాళ్ల అంబులెన్స్ ను రావాలని కోరారు. కానీ.. ఉద్దానం ఫౌండేషన్ అంబులెన్స్ డ్రైవర్ కరోనా వచ్చిన పేషెంట్ ను తీసుకెళ్లేందుకు ముందుకు రాలేదు. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో.. తనే అంబులెన్స్ డ్రైవర్ గా మారి.. ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.
ప్రాణాలకు తెగించిన తహశీల్దార్ ను మెచ్చుకున్న స్థానికులు
తన ప్రాణాలకు తెగించి.. అంబులెన్స్ డ్రైవర్ గా మారి.. కరోనా సోకిన వ్యక్తిని సరైన సమయానికి ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటిన తహశీల్దార్ గురుప్రసాద్ ను అక్కడి స్థానికులు తెగ మెచ్చుకుంటున్నారు. కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలు మిగిలితే చాలు అని అనుకుంటున్న ఈ రోజుల్లో ఓ బాధితుడిని ఆసుపత్రికి తరలించిన తహశీల్దార్ నిజంగా గ్రేట్. అలాగే.. తహశీల్దార్ కు అక్కడి స్థానిక వాలంటీర్ శ్రీకాంత్ కూడా బాధితుడిని ఆసుపత్రికి తరలించేందుకు సహకరించాడు. మొత్తం మీద.. అక్కడి స్థానికులతో పాటు అధికారులు కూడా తహశీల్దార్ తో పాటు వాలంటీర్ శ్రీకాంత్ ను పొగడ్తల్లో ముంచెత్తారు.