KTR : మంత్రి కేటీఆర్ కారును అడ్డుకున్న సబ్ ఇన్‌స్పెక్టర్.. టీఆర్ఎస్ శ్రేణులు ఏం చేశాయంటే?
Ktr : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు కారుకు శనివారం చేదు అనుభవం ఎదురైంది. గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని బాపూజీ ఘాట్‌లో గాంధీజీ విగ్రహానికి నివాళి అర్పించేందుకు వెళ్తుండగా కేటీఆర్ కారును పోలీసులు అడ్డుకోబోయారు. అసలేం జరిగిందంటే.. గాంధీ జయంతి సందర్భంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ బాపూజీ ఘాట్‌లో నివాళులు అర్పించారు. అనంతరం దత్తాత్రేయ తన అధికారిక కారులో వెనుదిరుగుతున్నారు.
కేటీఆర్ కారు రాంగ్ రూట్‌లో..
ఈ క్రమంలో కేటీఆర్ కారు రాంగ్ రూట్‌లో వచ్చేసింది. దాంతో అక్కడే ఉన్న సబ్ ఇన్‌స్పెక్టర్ కేటీఆర్ కారును అడ్డుకున్నారు. కాగా, కేటీఆర్ కారును ఎస్‌ఐ అడ్డుకోవడంతో టీఆర్ఎస్ శ్రేణులు ఫైర్ అయ్యాయి. వెంటనే ఎస్‌ఐ వద్దకు వచ్చి కొందరు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎస్‌ఐని తోసోశారు. అయితే, ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్ఎస్ శ్రేణులు పోలీసు అధికారిని తోసేయడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు అయినంత మాత్రాన పోలీసు అధికారులను గౌరవించరా? అని అడుగుతున్నారు. కేటీఆర్ సైతం ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. కేటీఆర్ కారు రాంగ్ రూట్‌లో రావడం వల్లే ఎస్‌ఐ ఆపేందుకు ప్రయత్నించాడని అంటున్నారు.