Kavitha : బిఆర్ఎస్ ను కవిత మరింత దెబ్బ తీయబోతుందా ?
Kavitha : తెలంగాణ రాజకీయాల్లో దశాబ్ద కాలం పాటు తిరుగులేని శక్తిగా వెలిగిన భారత రాష్ట్ర సమితి (BRS) ప్రస్తుతం మునుపెన్నడూ లేని విధంగా తీవ్ర అంతర్గత సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రాంతీయ పార్టీలలో కుటుంబ పాలన పెచ్చుమీరినప్పుడు అధికారం కోసం, ఆస్తుల కోసం అంతర్గత పోరాటాలు సహజమే అయినప్పటికీ, కేసీఆర్ కుమార్తె కవిత స్వయంగా తన తండ్రి పాలనపైనే విమర్శలు గుప్పించడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. కాలేశ్వరం ప్రాజెక్టు వైఫల్యం, సామాజిక తెలంగాణ లక్ష్యం నెరవేరకపోవడం వంటి అంశాలపై ఆమె లెక్కలతో సహా చేస్తున్న ఆరోపణలు పార్టీకి తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయి. ప్రతిపక్షాలు చేయాల్సిన విమర్శలను సొంత ఇంటి నుంచే వినిపించడం గులాబీ శ్రేణులను అయోమయంలోకి నెట్టేసింది.
Kavitha : బిఆర్ఎస్ ను కవిత మరింత దెబ్బ తీయబోతుందా ?
ఈ అంతర్గత పోరాటం వెనుక లోతైన కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కవిత పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండి, ఇప్పుడు లిక్కర్ కేసు వంటి చట్టపరమైన ఇబ్బందులు ఎదురైనప్పుడు మాత్రమే ఎందుకు గళం విప్పుతున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు ‘జాగృతి’ శ్రేణులు ఈ వ్యవహారంపై భిన్నమైన వాదనను వినిపిస్తున్నారు. పార్టీలో కేటీఆర్ ఆధిపత్యం పెరగడం, హరీష్ రావు మరియు సంతోష్ రావుల జోక్యం వల్ల కవిత రాజకీయ ఎదుగుదలకు అడ్డంకులు ఏర్పడటం, చివరకు తన భర్త ఫోన్ కూడా ట్యాపింగ్ అయ్యేంత వరకు వెళ్లడం వల్లే ఆమె తిరుగుబాటు బావుటా ఎగురవేసినట్లు తెలుస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల అవినీతిలో హరీష్ రావును టార్గెట్ చేయడం ద్వారా ఆమె తన రాజకీయ ఉనికిని కాపాడుకోవాలని చూస్తున్నారు.
#image_title
ప్రస్తుతం బీఆర్ఎస్ ఎదుర్కొంటున్న ఈ సవాళ్లు ఆ పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. ఇప్పటికే పార్లమెంటు ఎన్నికల్లో సున్నా ఫలితాలు రావడం, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పట్టు కోల్పోవడంతో పార్టీ క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉంది. పార్టీ మనుగడే ప్రమాదంలో ఉన్న తరుణంలో, ముఖ్య నేతల మధ్య ఈ స్థాయిలో విభేదాలు బయటపడటం ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు రాజకీయంగా మేలు చేకూర్చే అవకాశం ఉంది. మరి ఈ గడ్డు కాలాన్ని తట్టుకుని, తన కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గ్యాప్‌ను పూడ్చి పార్టీని కేసీఆర్ ఎలా దారిలోకి తెస్తారో వేచి చూడాల్సి ఉంది.