TDP : టీడీపీ, బీజేపీ, జనసేన.. కుమ్ములాటల కూటమి.!
TDP : రాజకీయాల్లో రెండు ప్లస్ రెండు అంటే నాలుగు అవ్వొచ్చు.. లేదంటే, మూడుగా మారొచ్చు. లేకపోతే, రెండు.. అంతకన్నా తక్కువ అవ్వొచ్చు. చివరికి జీరో కూడా అవ్వొచ్చు. రాజకీయ సూత్రం ఇలాగే వుంటుంది. రెండు లేదా మూడు పార్టీలు కలవడమంటే, తద్వారా ఆ కూటమికి బలం చేకూరుతుందని కాదు.. వున్న బలాన్ని ఒక్కోసారి ఆ కూటమిలోని పార్టీలు కోల్పోవచ్చు కూడా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తుల పంచాయితీ నడుస్తోంది. బీజేపీ, జనసేన ప్రస్తుతానికి మిత్రపక్షాలు. టీడీపీ మాత్రం దూరంగా వుంది. ఆ టీడీపీ కూడా బీజేపీ, జనసేనతో కలిసేందుకు ఆరాటపడుతోంది.
కలిసి పయనిస్తే మంచి ఫలితాలుంటాయని మూడు పార్టీల్లోనూ అంతర్గతంగా చర్చ జరుగుతోంది కూడా.! సింగిల్‌గా వచ్చే ధైర్యం లేనప్పుడు కూటమి కట్టడం అనేది రాజకీయాల్లో మామూలే. దీన్ని తప్పు పట్టాల్సిన పనిలేదు. కానీ, ఒక్క జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో అన్ని శక్తులూ ఏకమవ్వాల్సి రావడం, వైఎస్ జగన్ బలాన్నీ, వైసీపీ బలాన్నీ చెప్పకనే చెబుతున్నాయి. ‘మీరెలా వస్తారో మీ ఇష్టం.. మేమైతే 170 ప్లస్ సీట్లు కొల్లగొట్టబోతున్నాం..’ అని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. కానీ, వార్ వన్ సైడ్.. అంటున్నారుట టీడీపీ అధినేత. అంతకు ముందు వన్ సైడ్ లవ్..
అని అన్నది కూడా టీడీపీ అధినేత చంద్రబాబే.! పొత్తుల పంచాయితీ లెక్క తేలడంలేదు. వడ్ల గింజలంటూ జనసేన పార్టీ మీద టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు అందర్నీ విస్మయానికి గురిచేశాయి. మరోపక్క, జనసేన అధినేతను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలంటూ చిత్రమైన వాదనను జనసేన నేతలు, బీజేపీ ముందర వుంచారు. ఎటు చూసినాగానీ, మూడు ప్రధాన రాజకీయ పార్టీలో ఇంత గందరగోళం పెట్టుకుని, మూడూ కలిసి, అధికార పక్షంపై రాజకీయ దాడి చేస్తామంటే ఎలా.?