Ys Jagan : సిఎం వైఎస్ జగన్ కు పది ఎమ్మెల్యేల లేఖ.. కారణం…?
Ys Jagan : ఉభయగోదావరి జిల్లాల రైతుల ధాన్యం బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిఎం వైఎస్ జగన్ కు టీడీపీ ఎమ్మెల్యేలు లేఖ రాసారు. రెండు జిల్లాలకు చెందిన పదిమంది టీడీపీ యంయల్ ఏలు, ఎమ్మెల్సీలు లేఖ రాసారు. ఏలూరులో లేఖ విడుదల చేసిన ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు , మంతెన రామరాజు… ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు.
నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ధాన్యం అమ్మి 3, 4 నెలలు గడుస్తున్నా నేటికి రైతులకు సొమ్ము చెల్లించకపోవడం అన్యాయం అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ధాన్యం సొమ్ములు ఇవ్వకపోతే, గత పంట పెట్టుబడికి వడ్డీ ఎవరు కడతారు? రెండో పంట దాళ్వాకు పెట్టుబడి ఎలా తేవాలి? అని నిలదీశారు.
ధాన్యం కొనుగోలు వివరాలను పారదర్శకంగా చూపించవలసిన ప్రభుత్వం ఆన్ లైన్ నుండి ఎందుకు వాటిని తొలగించింది? అని ప్రశ్నించారు. గోదావరి జిల్లాల రైతులు 27 మంది వైసీపీ ఎమ్మెల్యేలను, అయిదుగురు ఎంపీలను గెలిపించినందుకు శిక్ష విధిస్తారా అని ప్రశ్నించారు. గోదావరి జిల్లాల పట్ల, రైతాంగం పట్ల నిర్లక్ష్యం, కక్షను ముఖ్యమంత్రి విడనాడాలి అని ఆయన విజ్ఞప్తి చేసారు.