కేటీఆర్ ను అస్సలు వదిలిపెట్టడం లేదుగా.. మళ్లీ పద్మారావు అదే పాట.. కేటీఆర్ ఈసారి గట్టిగానే ఇచ్చేశారు?
సీఎం కేటీఆర్.. ఆహా.. వినడానికి ఇది ఎంత బాగుందో అంటారా? మనకు కాదు లెండి. టీఆర్ఎస్ పార్టీ నేతలకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎం కేటీఆర్ అని వింటుంటే ఎంతో బాగున్నట్టుంది. అందుకే.. స్టేజిల మీద, బహిరంగంగా.. కేటీఆర్ సీఎం అని నిర్మోహమాటంగా అనేస్తున్నారు. కేటీఆర్ పక్కనే ఉన్నా కూడా ఏమాత్రం భయపడకుండా.. కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి.. కేటీఆరే కాబోయే సీఎం.. అని అనేస్తున్నారు. కేటీఆర్ ఇవన్నీ విని ఏమీ అనకుండా ఊరుకుంటున్నారు తప్పితే.. పల్లెత్తు మాట అనడం లేదు. దీంతో మంత్రులు, ఇతర పార్టీ నాయకులు రెచ్చిపోతున్నారు.
ఇప్పటికే మంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్.. కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి? ఆయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఇంకా ముందుకెళ్తుంది. అభివృద్ధిలో ముందంజలో ఉంటుంది.. అంటూ చెప్పుకొచ్చారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావు అయితే ఏకంగా.. కేటీఆర్ ముందే.. కాబోయే సీఎం కేటీఆర్.. అని అన్నారు. దానికి కేటీఆర్ కూడా ఏం అనలేదు.
కాకపోతే.. ఆ తర్వాత అలా అనొద్దు బహిరంగంగా అని కేటీఆర్.. నాయకులకు క్లాస్ పీకినట్టు వార్తలు వచ్చాయి. దీంతో కొందరు నాయకులైతే ఆ విషయాన్న మాట్లాడటం లేదు.
కానీ.. డిప్యూటీ స్పీకర్ పద్మారావు మాత్రం అదే పాటను పాడుతున్నారు. ఏమాత్రం వదలడం లేదు. మరి.. కేటీఆర్ ను ప్రసన్నం చేసుకుంటే ఆయనకు ఏమొస్తుందో తెలియదు కానీ.. ఆయన మాత్రం అదే పాట పాడుతున్నారు.
త్వరలో కేటీఆర్ సీఎం అవ్వబోతున్నారు
తాజాగా జరిగిన మీడియా సమావేశంలో… త్వరలోనే కేటీఆర్ సీఎం కాబోతున్నారంటూ స్పష్టం చేశారు. కేటీఆర్ సీఎం అవుతారని నాలుగేళ్ల క్రితమే తాను చెప్పాలని మరో బాంబు పేల్చారు. అయితే.. దీనిపై కేటీఆర్ కూడా సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఆలు లేదు చూలు లేదు.. ఎందుకిలా బయట ప్రచారం చేస్తున్నారని మండిపడినట్టు తెలుస్తోంది.
వీళ్లంతా కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే.. తమకు మంత్రుల పదవుల కోసం ఇలా ఇప్పటి నుంచే కేటీఆర్ ను ప్రసన్నం చేసుకోవడం కోసం ఇలా చేస్తున్నారని.. అందుకే.. కేటీఆర్ కూడా ఈ విషయంపై అంత తొందరపడి బహిరంగంగా చెప్పొద్దంటూ ముఖ్య నేతలకు సూచించినట్టు తెలుస్తోంది.