Lockdown : రాష్ట్రంలో విద్యా సంస్థలకు సెలవులు.. నెలాఖరులో లాక్ డౌన్..ఒమిక్రాన్ ఉద్ధృతే కారణం..!
రాష్ట్రంలో ఓ వైపు కరోనా, మరో వైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 8 నుంచి 16వ తదీ వరకు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సోమవారం నాడు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకీ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో.. విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని పలువురు అభిప్రాయపడుతూ వచ్చారు. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని.. ఆ మేరకు ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు 4 వేలకు పైగా ఉన్నాయి. మరోవైపు ఒమిక్రాన్ కేసులు 90 కి చేరువయ్యాయి.
విదేశాల నుంచి వచ్చిన వారి వల్లే మళ్లీ కేసులు పెరుగుతున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది. ఇదిలా ఉండగా… రాష్ట్రంలో ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. అయితే పరిస్థితులు మరింత తీవ్రంగా మారితే ఈ నెలాఖరులో లాక్ పెట్టక తప్పదని రాష్ట్ర వైద్య ఆరోగ్య సంచాలకులు శ్రీనివాస్ తెలిపారు.