HMPV Virus : గుబులు పుట్టిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ .. అప్రమత్తమైన ప్రభుత్వం
HMPV Virus : చైనాలో కొత్త వైరస్ మరోసారి భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే కరోనాతో ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోయింది. కరోనాకు కేంద్రబిందువు సైతం చైనానే. అదే డ్రాగన్ దేశంలో తాజాగా ‘హ్యూమన్ మెటానిమో వైరస్ (హెచ్ఎంపీవీ) వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇదే వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. చైనాలో హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటానిమోవైరస్) వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రం అప్రమత్తమైంది.
HMPV Virus భయం అవసరం లేదు..
ఈ మేరకు ఫ్లూ లక్షణాలు ఉన్న వారు మాస్కులు ధరించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదు కాలేదని స్పష్టం చేసింది. కానీ జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నవారు సమూహాలకు దూరంగా ఉండాలని సూచించింది. హెచ్ఎంపీవీపై చైనా స్పందించింది. ఆసుపత్రుల్లో రద్దీ పెరిగిందని లీక్ అయిన వార్తలను చైనా ప్రభుత్వం ఖండించింది. ఈ కథనాలు పూర్తిగా నిరాధారం అని, ప్రజలు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది.
చలికాలంలో సాధారణంగా శ్వాసకోశ వ్యాధుల తీవ్రతనే ఎక్కవగా ఉంటుందని, కానీ గతేడాదితో పోలిస్తే పరిస్థితి కొంచెం మెరుగ్గానే ఉందని పేర్కొంది. చైనాలో విదేశీయులు భద్రంగానే ఉండొచ్చని, కొత్త వైరస్ వ్యాప్తి చెందినట్లు వస్తున్న వార్తలో ఎలాంటి నిజాలు లేవని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని విదేశాంగ శాఖప్రతినిధి మావోనింగ్ వెల్లడించారు