TRS : టీఆర్ఎస్ పెద్దలపై కరోనా పంజా… నిన్న కేసీఆర్… ఇవాళ కేటీఆర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TRS : టీఆర్ఎస్ పెద్దలపై కరోనా పంజా… నిన్న కేసీఆర్… ఇవాళ కేటీఆర్

 Authored By jagadesh | The Telugu News | Updated on :23 April 2021,11:45 am

TRS : టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం కరోనా పంజాకు చిక్కుకుంది. నాగార్జున సాగర్ ఉపఎన్నిక ముందు వరకు టీఆర్ఎస్ పార్టీలో కరోనా ప్రభావం అంతగా లేదు. అప్పుడప్పుడే కరోనా తన కోరలు చాచడం ప్రారంభించింది. అయినప్పటికీ.. నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారం, అంతకుముందు ఎమ్మెల్సీ ఎన్నికలు… ఇలా వరుసగా ఎన్నికలు రావడంతో.. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు. ర్యాలీలలో పాల్గొన్నారు. సభలు సమావేశాల్లో పాల్గొనడంతో కరోనా తన ప్రతాపాన్ని చూపించింది.

telangana minister ktr tests corona positive

telangana minister ktr tests corona positive

ఈనెల 14న నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారం కోసం సీఎం కేసీఆర్ హాలియా వెళ్లారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొన్నారు. అయితే.. సీఎం సభ అనగానే వేల మంది స్థానికులు అక్కడికి చేరుకున్నారు. కరోనా జాగ్రత్తలు పాటించకపోవడం… గుంపులు గుంపులుగా జనాలు ఆ సభకు రావడంతో నాగార్జునసాగర్ కరోనా హాట్ స్పాట్ గా మారింది. ఆ సభకు వెళ్లిన చాలామంది టీఆర్ఎస్ నేతలకు కరోనా సోకింది. నాగార్జున సాగర్ ఉపఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు కూడా కరోనా సోకింది. మరికొందరు సాగర్ కు చెందిన టీఆర్ఎస్ నాయకులకూ సోకింది. అక్కడే సీఎం కేసీఆర్ కు కూడా కరోనా సోకినట్టు తెలుస్తోంది.

సీఎం కేసీఆర్ సభలో పాల్గొని ఇంటికి తిరిగొచ్చారు. వచ్చిన మూడునాలుగు రోజుల తర్వాత ఆయనకు కరోనా లక్షణాలు కనిపించాయి. అప్పటి వరకు ఆయనకు కరోనా సోకినట్టు తెలియకపోవడంతో అప్పటికే ఆయన చాలామంది టీఆర్ఎస్ పెద్దలతో సమావేశమయ్యారు. ఫ్యామిలీ మెంబర్స్ తోనూ కలిసి ఉన్నారు. దీంతో టీఆర్ఎస్ ముఖ్య నేతలకు కూడా కరోనా భయం పట్టుకుంది.

TRS : కేసీఆర్ ఫామ్ హౌజ్ కు పరిమితం కావడంతో కేటీఆర్ కు పెరిగిన బాధ్యతలు

సీఎం కేసీఆర్ కు కరోనా రావడంతో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం ఆపేసి… ఫాం హౌస్ లో హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు కేసీఆర్. టెస్టుల కోసం ఓసారి యశోద ఆసుపత్రికి వెళ్లారు అంతే. అంతకుమించి ఆయన బయటికి రావడం లేదు. ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. దీంతో… కేసీఆర్ బాధ్యతలను మంత్రి కేటీఆర్ తీసుకున్నారు. ఓవైపు పార్టీ పనులతో పాటు ప్రభుత్వ పనులను కూడా కేటీఆర్ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈనేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ కు కూడా తాజాగా కరోనా సోకింది. ఈ విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనను ఈ మధ్య కాలంలో కలిసిన వాళ్లు.. కరాచలనం చేసిన వాళ్లు అందరూ వెంటనే కరోనా పరీక్షలు చేయించుకొని హోం క్వారంటైన్ కు వెళ్లాలని సూచించారు.

కేటీఆర్ కు కూడా పెద్దగా లక్షణాలు లేవు. సీఎం కేసీఆర్ ఆరోగ్యం ప్రస్తుతం కుదుటపడింది. అయితే… టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలకు, ఇతర నేతలకు కూడా కరోనా భయం పట్టుకుందట. కేసీఆర్ కు, కేటీఆర్ కు సన్నిహితంగా మెలిగిన వాళ్లందరూ తమకు కూడా కరోనా వస్తుందేమోనని తెగ టెన్షన్ పడుతున్నారట. ఏది ఏమైనా కరోనా మాత్రం టీఆర్ఎస్ పెద్దలను తెగ భయపెట్టేస్తోంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది