CBI : తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి అప్పగించిన హైకోర్ట్..!!
CBI : తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి అప్పట్లో ప్రయత్నించటం తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో చోటు చేసుకున్న ఈ సంఘటన తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఆడియో మరియు వీడియో రికార్డింగ్ లు మీడియాలో సోషల్ మీడియాలో కుదిపేసాయి. అయితే ఈ కేసును తాజాగా తెలంగాణ హైకోర్టు సీబీఐకి అప్పగించడం జరిగింది.
ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ పై తమకు నమ్మకం లేదని భాజాప మరియు నిందితులు దాకాలు చేసిన పిటిషన్ లు పరిగణలోకి తీసుకొని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక ఇదే సమయంలో ఈ కేసును సిబిఐకి అప్పగించడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని సిట్ తరపు అధికారులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
అయినా గాని సిబిఐకి కేసునీ అప్పగిస్తూ.. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు వివరాలను కూడా సిబిఐకి అప్పగించాలని సిట్ కి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తమ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం సిట్ కి అప్పగించడం జరిగింది. అయితే సిట్ పై తమకు నమ్మకం లేదని భాజాపా మరియు నిందితులు దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేపట్టి.. ఈ కేసును సిబిఐకి అప్పగించడం సంచలనం సృష్టించింది.