Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం .. ఓటర్ జాబితా సవరణపై షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 29న జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ విషయంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఇదిలా ఉండగా, గ్రామ పంచాయితీల ఓటర్ జాబితా సవరణకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.

#image_title
తాజా ప్రకటనల ప్రకారం ఆగస్టు 28న ఫోటోలతో కూడిన ఓటర్ జాబితాను విడుదల చేయనున్నారు.ఆగస్టు 29న జిల్లా స్థాయిలో, 30న మండల స్థాయిలో రాష్ట్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలతో సమీక్ష సమావేశాలు నిర్వహించనుంది.ఆగస్టు 28 నుంచి 30 వరకు ఓటర్ జాబితాపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు.
ఆగస్టు 31న వచ్చిన అభ్యంతరాలను పరిష్కరిస్తారు.సెప్టెంబర్ 2న తుది ఓటర్ జాబితాను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల అమలుపై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. అసెంబ్లీలో ఆమోదం పొందిన బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదం కోసం పెండింగ్‌లో ఉంది. అదే సమయంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదాను కూడా గవర్నర్‌కు పంపింది.అయితే, తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30 లోగా నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ పరంగా మాత్రం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని భావిస్తోంది. ఈ నెల 29న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల అమలుపై కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.