Gudivada : భగ్గుమన్న గుడివాడ.. రంగంలోకి దిగిన టాప్ ఏపీ పోలీస్..!
Gudivada : కృష్ణా జిల్లా గుడివాడలో ప్రస్తుతం పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఎందుకంటే.. టీడీపీ సీనియన్ నేత, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు బెదిరింపు కాల్ వచ్చిన విషయం తెలిసిందే. తనకు బెదిరింపు కాల్ రావడం మాత్రమే కాదు.. తనను, తన అనుచరులు, టీడీపీ నాయకులపై దాడికి కొందరు ప్రయత్నించారంటూ రావి వెంకటేశ్వరరావు ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే.. ఆ దాడులు చేసింది ఎవరో కాదు.. వైసీపీ నేతలు అని ఆయన విమర్శించారు. దీంతో గుడివాడలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. వాతావరణం మొత్తం మారిపోయింది. పోలీసులంతా రంగంలోకి దిగాల్సి వచ్చింది. వంగవీటి రంగా వర్థంతి సందర్భంగా..
కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం రావి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అయితే.. ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవడం కోసం వైసీపీ నేతలు ప్రయత్నించారని ఆరోపిస్తున్నారు. అసలు.. వంగవీటి రంగాను చంపించిందే టీడీపీ పార్టీ అని.. అటువంటి వాళ్లు అసలు వంగవీటి రంగా వర్థంతి ఎలా చేస్తారు అంటూ వైసీపీ నేతలు ఆ కార్యక్రమాన్ని జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. గుడివాడలోని టీడీపీ పార్టీ కార్యాలయానికి కూతవేటు దూరంగా ఈ వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు టీడీపీ ఏర్పాట్లు చేయడగా.. వైసీపీ నేతలు వచ్చి కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో అక్కడ ఘర్షణ చోటు చేసుకుంది.
Gudivada : రావి వర్గం, వైసీపీ నాయకుల మధ్య తోపులాట
ఈనేపథ్యంలో రావి వెంకటేశ్వరరావు వర్గీయులు, వైసీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. ఆ తర్వాత కాసేపు అక్కడ గొడవ జరిగింది. వెంటనే ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరుడు అయిన కాళీ.. రావి వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసి చంపుతా అంటూ బెదిరించాడని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు పక్షాలను అక్కడి నుంచి తరిమారు. రెండు పార్టీల నేతలను అదుపులోకి తీసుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఈ ఘటన వెనుక కొడాలి నాని హస్తం ఉందని.. టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. ఆ గొడవకు సంబంధించిన వీడియోను కూడా లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.