Facebook Post : ఆడపిల్ల జీవితాన్ని కాపాడిన ఫేస్ బుక్ పోస్ట్..!!
Facebook Post : ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా మనిషి జీవితంలో భాగమైపోయింది. విలువలు.. బంధువులు.. రక్తసంబందుల కోసం ఒకప్పుడు మనుషులు బతికే వాళ్ళు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా కోసం బతికే పరిస్థితి చాలా వరకు కనిపిస్తోంది. వాస్తవ జీవితాన్ని వేరే రూపంగా ఫోటోలతో వీడియోలతో చిత్రీకరించి సమాజంలో గుర్తింపు కోసం పాకులాడుతున్న వాళ్ళు ఎక్కువ అయిపోయారు. వయసుతో సంబంధం లేకుండా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ద్వారా ఎవరి టాలెంట్ వాళ్ళు చూపిస్తున్నారు. సోషల్ మీడియా కారణంగా కొన్ని మోసపూరితమైన ఘటనలతో పాటు కొన్ని మంచి పనులు కూడా జరుగుతున్నాయి. ఈ రకంగానే ఫేస్ బుక్ పోస్ట్ ఓ ఆడపిల్ల జీవితం కాపాడింది.
మేటర్ లోకి వెళ్తే దేశంలో బాల్యవివాహాలు చట్టవిరుద్దమని అందరికీ తెలుసు. అయినా గాని దేశంలో ఎక్కువగా రాజస్థాన్ రాష్ట్రంలో బాల్య వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఈ రకంగానే 18 నిండకుండానే..తనకన్నా ఆరేళ్లు పెద్దవాడైన నరేష్ తో సుశీల అనే 12 ఏళ్ల అమ్మాయికి పెద్దలు 2017లో వివాహం జరిపించారు. అయితే అప్పటి నుండి పుట్టింట్లోనే గడిపింది. అయితే ఇటీవల ఆమెకు 18 ఏళ్లు నిండగా… అత్తింటి వారు తీసుకెళ్లడానికి రాగా, సుశీల తీవ్రంగా ఖండించింది. అయినప్పటికీ తల్లిదండ్రుల ఒత్తిడితో వెళ్లక తప్ప లేదు. అయితే అక్కడి వాతావరణం, కుటుంబ సభ్యుల తీరుతో విసుగుపోయిన యువతి ఇంటి నుండి బయటకు వచ్చేసింది.
ఆ తర్వాత న్యాయ పోరాటానికి దిగింది. ఈ క్రమంలో సారథి ట్రస్ట్ అనే ఓ స్వచ్ఛంద సంస్థ నడుపుతున్న క్రితి భారతీని కలవడం జరిగింది. దీంతో రంగంలోకి దిగిన భారతి…. సుశీల బంధువులను న్యాయస్థానానికి వచ్చి సాక్ష్యం చెప్పాలని కోరింది. వాళ్ళు ఎవరూ రాలేదు. అయితే వివాహమైన సమయంలో సుశీల భర్త తన ఫేస్బుక్ అకౌంట్ లో పెళ్లి చేసుకున్న ఫోటో షేర్ చేయడం జరిగింది. 2017లో వీరు వివాహం అయినట్లు పోస్ట్ చేసిన తేదీ సహా ఉండటంతో న్యాయస్థానం.. సుశీలది బాల్యవివాహమని చట్టవిరుద్దమని కొట్టి పారేసింది. అనంతరం సుశీల కష్టపడి 12వ తరగతి చదివి పోలీస్ శాఖలో ఉద్యోగం సంపాదించి తనలాంటి బాధితులను రక్షిస్తానని తాజాగా చెప్పుకొచ్చింది. ఈ రకంగా ఫేస్ బుక్ పోస్ట్ ఓ ఆడపిల్ల జీవితం కాపాడటం సంచలనం సృష్టించింది.