Three Capitals : త్రీ క్యాపిటల్స్.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఎజెండా కాబోతోందా.?
Three Capitals : 2024 ఎన్నికల వరకూ వేచి చూస్తారా.? అంతకన్నా ముందే, ముందస్తు ఎన్నికలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళతారా.? వెళితే, మూడు రాజధానుల సంగతేమవుతుంది.? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానులకు కట్టుబడి వున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకున్నప్పటికీ, సమగ్రమైన బిల్లుని మరోసారి ప్రవేశపెడ్తామని వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, రోజులు గడుస్తున్నా మూడు రాజధానుల విషయమై వైసీపీ సర్కారు ముందడుగు వేయడంలేదన్న విమర్శలున్నాయి.
వాస్తవానికి మూడు రాజధానులనేది కాస్త సున్నితమైన అంశం. అమరావతి కోసం భూములిచ్చిన రైతులతో పెను ఇబ్బంది ఎదురవుతోంది వైసీపీ ప్రభుత్వానికి మూడు రాజధానుల విషయంలో. ఆ రైతుల వెనుక విపక్షాల రాజకీయం సుస్పష్టం. అందుకే, వచ్చే ఎన్నికల్లో మూడు రాజధానులపై ప్రజా తీర్పు కోరాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ‘మా విధానం మూడు రాజధానులు.. ఖచ్చితంగా రాష్ట్రానికి మూడు రాజధానులు నిర్మించి తీరతాం..’ అని వైసీపీ బలంగా చెబుతోంది. కానీ, ముందైతే ఓ రాజధాని నిర్మాణం చేసి చూపించండని విసక్షాలు ఎద్దేవా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ అత్యంత వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. రాజధాని అమరావతిలో అభివృద్ధి పనుల్ని పునఃప్రారంభిస్తోంది వైసీపీ సర్కారు. వీలైనంత తక్కువ కాలంలో, వీలైనంత ఎక్కువ అభివృద్ధి చేసి, రాజధానికి ఓ రూపం తెచ్చి, ఆ తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తేవాలన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. మరోపక్క, త్వరలోనే మూడు రాజధానుల విషయమై అసెంబ్లీలో కొత్త బిల్లు ప్రవేశపెడతారనే ప్రచారం కూడా జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లోపు అసెంబ్లీలో బిల్లు పెట్టినా, పెట్టకున్నా వచ్చే ఎన్నికల్లో ముమ్మాటికీ మూడు రాజధానుల అంశం, ‘ఎన్నికల ఎజెండా’గా మారే అవకాశాలు స్పష్టంగా వున్నాయి.