Thummala Nageswara Rao : బీఆర్ఎస్‌కి తుమ్మల రాజీనామా.. టచ్‌లోకి కాంగ్రెస్?
Thummala Nageswara Rao : తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచే ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ మూడు నెలల ముందుగానే ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టును ప్రకటించింది. ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ముందుగానే 115 నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. అందులో దాదాపుగా సిట్టింగ్ లకే టికెట్స్ ఇచ్చారు.
కేవలం 7 నియోజకవర్గాల్లో మాత్రమే ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చారు సీఎం కేసీఆర్. తమకు ఎలాగైనా టికెట్ లభిస్తుందని చాలామంది బీఆర్ఎస్ ఔత్సాహికులు ఇన్ని రోజులు ఎదురు చూశారు. కానీ.. తమకు టికెట్ వస్తుంది అని భావించిన చాలామంది నేతలకు టికెట్ రాలేదు. అందులో ఖమ్మం సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు కూడా ఉన్నారు. ఆయనకు పాలేరు నుంచి ఈసారైనా టికెట్ కేటాయిస్తారని అనుకున్నా అది జరగలేదు. మళ్లీ కందాల ఉపేందర్ రెడ్డికే కేసీఆర్ టికెట్ కేటాయించారు.
Thummala Nageswara Rao : బీఆర్ఎస్ కి బైబై చెప్పబోతున్నారా?
తనకు టికెట్ కేటాయించకపోవడంతో బీఆర్ఎస్ అధిష్ఠానంపై తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఆయనకు నిరాశే మిగలడంతో తన అనుచరులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. తన అనుచరులతో కలిసి భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్.. తుమ్మలను పార్టీలో చేర్చుకునేందుకు రెడీగా ఉందట. ఆయన బీజేపీలో చేరుతారా? లేక కాంగ్రెస్ లో చేరుతారా? అనేది తెలియదు. అయితే.. ఇప్పటికే మంత్రి హరీశ్ రావు.. తుమ్మలతో టచ్ లోకి వచ్చారట. అలాగే ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర రావు కూడా తుమ్మలతో భేటీ అయ్యారట. అయినా కూడా తుమ్మల పాలేరు నుంచి కనీసం రెబల్ అభ్యర్థిగా అయినా పోటీ చేసేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి పాలేరు టికెట్ హామీ వస్తే అందులో చేరేందుకు తుమ్మల సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా.. ఏ పార్టీలో చేరినా చేరకపోయినా చివరి సారి పాలేరు నుంచి పోటీ చేసి గెలిచి ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని తుమ్మల భావిస్తున్నట్టు తెలుస్తోంది.